Kidnap Case : కూరగాయలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేత కుమార్తె కిడ్నాప్‌కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్ళారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. జైపూర్ లోని కాంగ్రెస్ నాయకుడు కేసావత్ కుమార్తె అభిలాష కనిపించకుండా పోయింది. ఆ యువతి కూరగాయల కొనుగోలుకు సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం 5.30 గంటలకు తన స్కూటీపై బయల్దేరి ఎన్‌ఆర్‌ఐ సర్కిల్ దగ్గరకు వెళ్లింది. అయితే 6.05 గంటల సమయంలో తన తండ్రికి అభిలాష ఫోన్ చేసింది. తనను కొంతమంది ఫాలో అవుతున్నారని, త్వరగా రావాలని అడిగిందని కేసావత్ పోలీసులకు చెప్పారు. కొద్దిసేపటికే ఫోన్ కట్ అయిందని, తన కూతురు ఇక కనిపించలేదని ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు జైపూర్ పోలీస్ కమిషనరేట్‌కు కూడా కాంగ్రెస్ నాయకుడు గోపాల్ కేసావత్ వెళ్లారు. తన కుమార్తె కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని… త్వరగా ఆమెను వెతికి పట్టుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోపాల్ కెసావత్, అతని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుమార్తె ఆచూకీని త్వరగా గుర్తించాలని కోరారు. మరోవైపు పోలీసులు అభిలాషను ఆచూకిని తెలుసుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు.
కాగా మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఆమె ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. అలాగే ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా కేసావత్ ప్రస్తుతం రాజస్థాన్ డీనోటిఫైడ్ ట్రైబ్స్, సంచార, పాక్షిక సంచార గిరిజనుల సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.