కరోనా… కొంతకాలంగా ఈ మాట తప్ప ఇంకో మాట ఎక్కడా వినబడలేదు. తొలి దశలోనైతే అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది ఈ రక్కసి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ఆర్థికంగానే గాక అన్ని విధాలుగానూ దెబ్బ తిన్నాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువులో వెనకబడడం, పరీక్షలు లేకండానే అందరినీ ఉత్తీర్ణులను చేయడం, ఎంతోమంది ఉద్యోగ, వ్యాపార ఉపాధి అవకాశాలను కోల్పోవడం జరిగింది. దీంతో ప్రపంచమే చితికిపోయింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ప్రాణాలను కోల్పోవడం, ఇంటికి ఒకే ఒక్క ఆధారమైన యజమాని అసువులు బాయడం… ఇలాంటి కారణాలవల్ల లెక్కకు మించిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
దారుణమైన విషయమేంటంటే, కరోనా రక్కసి కోరలకు ఇంట్లో అందరూ బలై పోగా అనాథలుగా మిగిలిపోయిన చిన్నారుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. కరోనా దశలు మార్చుకుంటూ మూడో దశకు చేరింది. కాకపోతే, ఈ దశ అంత ప్రమాదకరం కాదు అని అందరూ అంటున్న నేపథ్యంలో కరోనా బారిన పడేవారి సంఖ్య ఒకరోజు పెరుగుతూ, ఒకరోజు తగ్గుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. రెండు రోజుల తర్వాత తిరిగి పదివేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 3.62 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 12,608 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొన్నటి కంటే దాదాపు మూడు వేల కేసులు పెరిగాయి. నిన్న ఒక్క రోజే కరోనా వల్ల 72 మంది చనిపోయారు. అదే సమయంలో 16,251 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 1,01,343 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉండగా.. పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదైంది. రికవరీ రేటు మాత్రం 98.50 శాతంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటిదాకా 208 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. బుధవారం అంటే ఆగస్టు 17వ తేదీన ఒక్కరోజే 38.64 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. కరోనా రక్కసి తొందర్లోనే తోక ముడిచి పూర్తిగా, శాశ్వతంగా పారిపోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.