Crime News : పెళ్లి అనేది ఒక వేడుకల జరుపుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న విషయమే. ఎవరికి ఉన్నంతలో వారు వివాహాన్ని వైభవంగా జరుపుకుంటారు. అయితే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఆ ఘటన పూర్తి వివరాలు…
ఒడిశా లోని ఖోర్దా జిల్లా శారదాపూర్‌కు చెందిన సంజయ్ నిశాంక్ బీబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని సౌభాగ్య నగర్ కాలనీ ఉంటూ ఓ ఫుడ్ డెలివరీ కంపెనీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల నిశాంక్‌కు పెళ్లి నిశ్చయమైంది. అయితే తన వివాహాన్ని ఘనంగా చేసుకోవాలనుకున్న నిశాంక్… అందుకు డబ్బు సమకూర్చేందుకు చోరీలు మొదలుపెట్టాడు. షూలు, షర్ట్‌లు, బంగార నగల వరకు అన్నింటిని దొంగతనాల ద్వారా సేకరిస్తున్నాడు. పగటి పూట ఎక్కువగా చోరీలు జరగడం, ఓ వ్యక్తి హెల్మెట్‌తో బైక్‌పై తిరగడం వంటి దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో బయటపడ్డాయి. ఆ బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు నిశాంక్‌ను పట్టుకున్నారు.
ఇక తమాడిన శైలిలో పోలీసులు విచారించగా… నిశాంక్ నిజాల్ని కక్కేశాడు. తన మ్యారేజ్ కోసం ఈ బాట పట్టానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం నిశాంక్ ఇంట్లో తనిఖీలు చేయగా… పెద్ద ఎత్తున వస్తువులు కనిపించాయి. 230 బ్రాండెడ్ జీన్స్, 25 జతల బూట్లు, మహిళల లో దుస్తులు, 450 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.25 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు సంజయ్ నిశాంక్‌పై మొత్తం 18 చోరీ కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా పెళ్లి కోసం ఇలా దొంగతనాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.