Crime News : ఆంధ్రప్రదేశ్‌లోనివిజయవాడ లో కన్నబిడ్డను తల్లే విక్రయించిన ఘటన కలకలం రేపింది. స్థానిక భానునగర్ లో నివాసం ఉండే కల్యాణి యాచకురాలిగా ఉంటూ జీవనం సాగిస్తుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకరిని తన వద్ద పెట్టుకుని, మిగిలిన ఇద్దరిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉంటున్న బంధువులకు ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. కాగా కొద్ది నెలల క్రితం ఆమె మళ్ళీ గర్భం దాల్చింది. ఈ సమయంలో భానునగర్‌లో ఉండే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి రోజూ పోషకాహారాన్ని తీసుకునేది. ఈ క్రమంలోనే ఈ నెల 23న విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
కానీ వైద్యులు డిశ్చార్జి చేయకుముందే, ఆసుపత్రిలో సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత కొన్ని రోజులకు తెలిసినవారి ద్వారా బేరం కుదుర్చకుని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ కుటుంబానికి రూ.50 వేలకు శిశువును విక్రయించినట్లు తెలుస్తుంది. అంగన్ వాడీ కార్యకర్తకు కళ్యాణి కనిపించినప్పుడు… ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తుండగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆశ కార్యకర్తతో కలిసి వివరాలు తెలుసుకోగా ఆసుపత్రి నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వచ్చేసిందని గుర్తించారు.
దీంతో పుట్టిన బిడ్డని ఏం చేశావని ప్రశ్నించినా సమాధానమివ్వక పోవడంతో వారు గుణదల పోలీసులకు సమాచారం ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వీఎస్ఎన్ వర్మ, గుణదల ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ ఘటనా స్థలానికి వెళ్లి… ఆమెను విచారించగా బిడ్డను కనిగిరిలోని ఓ కుటుంబానికి విక్రయించినట్టుగా అంగీకరించింది. పోషించే స్థోమత లేకపోవడంతో ఈవిధంగా చేశారని ఒప్పుకుంది. దీనిపై గుణదల పోలీసులు కేసు నమోదు చేసి.. శిశువులను విక్రయించే ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. అయితే.. ముఠా సభ్యులు ఇప్పటివరకు నలుగురు శిశువులను విక్రయించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఒంగోలు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు సిబ్బందిని పంపించినట్లు అధికారులు తెలిపారు. పోషించే స్థోమత లేనప్పుడు పిల్లల్ని కానీ వారి జీవితలను ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.