‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ హన్సిక. ఈ సినిమాకు ముందు ఆమె బాలనటిగా ఓ చిత్రంలో నటించింది. అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. తెలుగులో మంచి విజయాలు పొందాక తమిళం, కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఆమె ఎదిగి మంచి పేరును సంపాదించింది.
సినీ జీవితంతో పాటు నేటి నుంచి ఆమె మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. తన ప్రియుడు సోహైల్ ను హన్సిక పెళ్లి చేసుకుని పెళ్లిబంధంతో నూతన జీవితానికి శ్రీకారం చుట్టనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో హీరోయిన్ హన్సిక పెళ్లి జరగనుంది. అయితే ఈ పెళ్లికి కొంత మంది మాత్రమే కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరు కానున్నారు. కేవలం కొంత మంది సమక్షంలోనే ఈ పెళ్లి వేడుక జరగనుంది. సినీ సెలబ్రిటీలలో కూడా కొంత మందికి మాత్రమే హన్సిక ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.
సెలబ్రిటీ పెళ్లి అంటే చాలా మంది వస్తారు. కానీ హన్సిక మాత్రం తన పెళ్లికి నిరుపేద చిన్నారులను ఆహ్వానించింది. గత కొన్నేళ్లుగా హన్సిక పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చాలా ఎన్జీవోలతో కలిసి ఆమె నిరుపేద చిన్నారులకు సాయం చేస్తూ బాసటగా నిలుస్తోంది. తన పెళ్లి సందర్భంగా అటువంటి పిల్లలను ఆహ్వానించింది. తమపై ప్రేమను కురిపించిన హన్సికకు సదరు చిన్నారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పెళ్లిరోజు నాడు హన్సిక తన వివాహ వేదికకు పరిసరాల్లో ఉన్నటువంటి చిన్నారులకు ప్రత్యేకమైన భోజనాన్ని పంపించనుంది. పెళ్లికి ముందు మెహెందీ, సంగీత్ లో హన్సిక, సోహైల్ దంపతులు ఆనందంగా గడిపారు. బంధువులతో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.