Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజుని అభిమానులు ఘనంగా చేశారు.నిన్న ఆగష్టు 9 న బర్త్ డే స్పెషల్ గా బిజినెస్ మెన్ సినిమా రీ రిలీజ్ చేయగా థియేటర్స్ లో అభిమానులు సందడి చేశారు. అభిమానులు మహేష్ పుట్టిన రోజుని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక కొంతమంది అభిమానులు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఓ నక్షత్రాన్నికొనేసి దానికి మహేష్ పేరు పెట్టేశారు.
మహేశ్ పుట్టినరోజును పురస్కరించుకొని నక్షత్ర మండలంలోని ఒక నక్షత్రానికి సూపర్ స్టార్ మహేశ్ బాబుగా నామకరణం చేసినట్లు అంతర్జాతీయ స్టార్ రిజిస్ట్రీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు స్టార్ సర్టిఫికేషన్ ను విడుదల చేసింది. భూమధ్య రేఖకు కుడివైపు ఆరోహణలో RA 12H33M29S Dec 69° 47′ 17.6′′ లొకేషన్ లో ఉన్న నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టినట్లు పేర్కొంది.
మహేశ్ బాబుపై అభిమానాన్ని చాటుకునేందుకు పలువురు అభిమానులు స్టార్ రిజిస్ట్రేషన్ ను సంప్రదించి నక్షత్రాన్ని కొనుగోలు చేశారు. ఆ నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టేందుకు కావాల్సిన వివరాలను నమోదు చేయడంతో స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ ఆమోదం తెలుపుతూ నక్షత్రానికి మహేశ్ బాబు పేరును ధృవీకరించింది. గెలాక్సీలోని ఓ నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై ఓ అభిమాని ఇదే విధంగా తన అభిమానాన్ని చాటుకొని నక్షత్రానికి సుశాంత్ పేరు పెట్టారు. ఇప్పుడు కూడా అభిమానం ఆకాశం లోని నక్షత్రాల వరకు చేరింది .