‘మాయా బజార్’ చిత్రం వెండితెర వైభవం. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు… ఎప్పుడూ… ఇంకో వందేళ్లైనా మనం ‘మాయా బజార్’ ని మరువలేం. బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల్లోనే వెండితెరపై ఆవిష్కరించబడిన అద్భుతాల్లో అదొకటి. విదేశాల్లో మనం ‘మాయా బజార్’ మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేంత గొప్పది ఆ చిత్రం.
‘మాయా బజార్’లోని ప్రతి దృశ్యాన్ని ఆస్వాదిస్తూ వివరించేవాళ్లూ, డైలాగ్ టు డైలాగ్ ని కంఠతా చెప్పేవాళ్లూ ఇప్పటికీ వున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే ‘మాయా బజార్’ చిత్రంలో ఇప్పటికీ ఆశ్చర్యపరచే అద్భుతాల్ని ఆవిష్కరించారు. అందులో ఒకటి… ‘లాహిరి లాహిరి లాహిరిలో…’ పాట చిత్రీకరణ. ఆంగ్లో ఇండియన్ సినిమాటోగ్రాఫర్ అయిన మార్కస్ బార్ట్లే ‘మాయా బజార్’ చిత్రానికి పని చేశారు. ఆయనో అద్భుతమైన సాంకేతిక మాంత్రికుడు. వెండితెరపై అద్భుతాల్ని ఆవిష్కరించడంలో చెయ్యి తిరిగిన దిట్ట.
‘లాహిరి లాహిరి లాహిరిలో…’ పాట నిజానికి సాయం సంధ్య దాటాక… అంటే చంద్రోదయం తర్వాత జరిగే నేపథ్యం. కానీ, ఆ పాటను మద్రాసుకు సమీపంలోని ఎన్నోర్ లో మిట్ట మధ్యాహ్నం షూట్ చేశారు. అవుట్ డోర్ షూట్ కేవలం ఒక పది, పదిహేను సెకన్ల నిడివి మాత్రమే చేశారు.
అయితే, ఇలా మనకు చంద్రోదయం ఫీలింగ్ ని కలిగించే పాటను మిట్ట మధ్యాహ్నం షూట్ చేసిన తొలి భారతీయ చిత్రం ‘మాయా బజార్’ కావడం మనందరికీ గర్వకారణం.