Electric Shock : కాలం కన్నెర్ర చేసిందంటే ఇదేనేమో అనిపిస్తుంటుంది కొన్ని ఘటనలు చూస్తుంటే. కాయ కష్టం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న వారి జీవితాలు ఇలా మధ్యలోనే ముగుస్తాయి అని ఎవరూ ఊహించి ఉండరు. అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కూడా ఈ కోవలోకే చెందుతుంది. పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఆరుగురు కూలీలను విద్యుత్ తీగలు బలిగొన్నాయి. పొలంలో పంట కోయడానికి వెళుతున్న కూలీలపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. పూర్తి వివరాల లోకి వెళ్తే…
అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూర్ లో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. దర్గాహొన్నూర్ లో మొక్కజొన్న పంట కోయడానికి కూలీలు అందరు కలిసి ఓ ట్రాక్టర్ లో వెళుతున్నారు. ఉదయం ఓ పంట కోసి మరో చోట మొక్కజొన్న కండెలు కోయటానికి ట్రాక్టర్ పై వెళుతుండగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పై పడ్డాయి.
ఈ ఘటనలో ఆరుగురు కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఆరుగురు మృతి చెందడంతో గ్రామస్తులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి వారి కుటుంబాల్లో వీరు లేని లోతు తీర్చలేనిదంటూ వారి బంధువులంతా రోధిస్తున్నారు. మిగిలిన ముగ్గురైన ప్రాలతో బయటపడాలని ప్రార్ధనలు చేస్తున్నారు.