Health శృంగారమంటే ఆనందం, సంతోషం, ఉత్సాహాన్ని కలిగించటమే కాదు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అవును మీరు చదివేది నిజమే.. మరి శృంగారంతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
ఒత్తిడిని తగ్గిస్తుంది… ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు అనగానే వ్యాయామం, ధ్యానం వంటివే గుర్తుకొస్తాయి. కానీ సెక్స్ వల్ల కలిగే లాభాలు చాలా మందికి తెలీవు. ఇదీ మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చురుకైన శృంగార జీవనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట. గుండెకు మంచిది… శృంగారం గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే సగటున నెలకు ఒకసారి, అంతకన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనేవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.
వ్యాయామంతో సమానం…. శృంగారంలో పాల్గొన్నప్పుడు నిమిషానికి సుమారు 6 కేలరీలు ఖర్చవుతాయి. ఇది కాస్త వేగంగా నడిచినప్పుడు ఖర్చయ్యే కేలరీలతో సమానం. శృంగారం మూలంగా తోటపని, నడక, మెట్లు ఎక్కుతున్నప్పుడు తీసుకునేంత ఆక్సిజన్ శరీరానికి లభిస్తుంది కూడా. పైగా శృంగారంతో ఉత్సాహం ఇనుమడించటం వల్ల ఇతరత్రా వ్యాయామాలు చేయటం మీదా ఆసక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుదల… మెదడు సమర్థంగా పనిచేయటానికీ శృంగారం తోడ్పడుతుంది. కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు గానీ ఇది జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటినవారిలో మరింత ప్రభావం చూపిస్తున్నట్టు బయటపడింది.
నిద్ర పట్టేలా… భావప్రాప్తి పొందినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది భాగస్వాముల మధ్య ప్రేమానురాగాలను పుట్టించి, అనుబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే శృంగార సమయంలో హాయి భావన కలిగించే ఎండార్ఫిన్లు సైతం పుట్టుకొస్తాయి. ఈ రెండింటి కలయిక మత్తుమందులా పనిచేసి నిద్ర పట్టేలా చేస్తుంది.
రోగ నిరోధక శక్తి బలంగా… అంతగా శృంగారం చేయనివారితో పోలిస్తే వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో రోగ నిరోధక శక్తి బలంగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణం సూక్ష్మక్రిములతో పోరాడే ఇమ్యునోగ్లోబులిన్ ఏ మోతాదులు పెరగటం. అయితే అతి శృంగారంతో ఉపయోగం లేదు. అంతగా శృంగారంలో పాల్గొనని వారి లోనూ వారానికి మూడు కన్నా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనేవారిలోనూ ఐజీఏ మోతాదులు ఒకేలా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. నొప్పులు తగ్గి బాధలు పోతాయ్… నొప్పులు, బాధల నుంచి దృష్టిని మరల్చటానికి శృంగారం మంచి సాధనం. దీంతో నొప్పులు తగ్గిన భావన కలుగుతుంది. అంతేనా? భావప్రాప్తి పొందినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్లు తలనొప్పి, వెన్ను నొప్పి, కాళ్ల నొప్పులు తగ్గటానికీ తోడ్పడతాయి.
శృంగారంతో రక్తపోటు అదుపులో…. రక్తపోటు అదుపులో ఉండే అవకాశముంది. ఎందుకంటే శృంగారం ఒకరకమైన ఏరోబిక్, కండరాలను వృద్ధి చేసే వ్యాయామాల మాదిరి ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆందోళనను తగ్గించి, హాయి భావన కలిగిస్తుంది. ఇవి రెండూ రక్తపోటు పెరగకుండా చూసేవే.