హైదరాబాద్ : తెలుగు తెరపై మంచి సినిమాలు, వినూత్న కాన్సప్ట్ తో వచ్చే సినిమాలను ప్రశంసించేందుకు నిత్యం ముందు వరుసలో ఉండే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మరోసారి తెలుగు సినిమాకు ఘనంగా సత్కారం చేసింది. ”బలగం” సినిమాతో మొదలైన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన ”మిస్టర్ ప్రెగ్నెంట్” సినిమా టీమ్ ను సోమవారం ఎఫ్ సి ఏ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా సన్మానించింది.
ఈ సినిమా నిర్మాత అప్పిరెడ్డి, హీరో బిగ్ బాస్ ఫెమ్ సోహెల్, దర్శకుడు శ్రీనివాస్ , మరో నిర్మాత రవీందర్ రెడ్డి , ఇతర నటీనటులు అభిషేక్ రెడ్డి, క్రాంతి, జ్యోస్నా, వర్షారెడ్డి, క్రాంతి, ప్రత్యూషలతో పాటు ఈ సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మరో సీనియర్ జర్నలిస్ట్ , ఎఫ్ సి ఏ మాజీ అధ్యక్షుడు ప్రభు హాజరై మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా టీమ్ ను అభినందించారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి మసాదే లక్ష్మి నారాయణ, ఈసీ మెంబర్స్ అప్పాజీ, ఆర్ డి ఎస్ ప్రకాష్, నవీన్ కుమార్, వీర్ని శ్రీనివాస్ పాల్గొని మిస్టర్ ప్రెగ్నెంట్ నటి నటులను, సాంకేతిక నిపుణులను సన్మానించారు. ఈ సినిమాను అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి కలిసి నిర్మించారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మసాదే లక్ష్మి నారాయణ మాట్లాడుతూ… బలగం సినిమా తరువాత ఎఫ్ సి ఏ ఇష్టపడి అభినందిస్తున్న సినిమా ఇదే అని అన్నారు. ఈ సినిమా బలగం సినిమా ఇప్పటికే వందకు పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది, అదేవిధంగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను కూడా అవార్డుల కోసం పంపించాలని నిర్మాతలకు సలహా ఇచ్చారు. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సప్ట్ తో ఇంతవరకు బహుశా సినిమా రాలేదని, ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా జాతీయ , అంతర్జాతీయ వార్డులకు ఈ సినిమాను పంపించాలని కోరారు.
ఈ మధ్య కాలంలో రెగ్యులర్ నిర్మాతల కంటే ఎన్ ఆర్ ఐ నిర్మాతలే ఎక్కువగా సినిమా చేస్తున్నారని అన్నారు. అయితే చాలా మంది ఎన్ ఆర్ ఐ నిర్మాతలు కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వైపుకే మొగ్గు చూపుతున్న తరుణంలో అప్పిరెడ్డి ఇలాంటి వెరైటీ కాన్సప్ట్ తో సినిమా తీయడం ఆయన అభిరుచికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇరవైఏళ్ళ క్రితం తాను ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పేపర్ లో పని చేస్తున్న రోజుల్లో ఈ సినిమా వచ్చి ఉంటె ప్రతి శుక్రవారం వచ్చే ”వెన్నెల” పేజీ రివ్వు లో ఖచ్చితంగా 5కు 5 రేటింగ్ వచ్చి ఉండేదని అన్నారు.