ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది దిగ్విజయంగా ముగిసింది. మొత్తం 23,114 జలవనరుల్లో 75.30 కోట్ల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకోసం ఏకంగా రూ.72 కోట్లు ఖర్చు చేసింది. అదేవిధంగా రొయ్య పిల్లల పంపిణీ కూడా పూర్తయింది. 182 జలవనరుల్లో రూ.16.17 కోట్ల విలువైన 6.47 కోట్ల రొయ్య పిల్లలను వదిలింది. మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2016-17లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఏడాది 3,939 జల వనరుల్లో చేప పిల్లలను వదిలారు. ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 23,114కి చేరింది. వచ్చే ఏడాది 30 వేలకు చేరుతుందని అధికారులు తెలిపారు.
ఖర్చు రూ.280 కోట్లు.. ఆదాయం రూ.13వేల కోట్లు : ఆరేండ్లలో 334.33 కోట్ల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందుకు రూ.280.44 కోట్లు ఖర్చు చేసింది. దీని వల్ల మత్స్యకారులకు భారీగా ఆదాయం సమకూరింది. ఉచిత చేప పిల్లల పంపిణీతో మొత్తంగా రూ.13,251 కోట్ల విలువైన చేపల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది ఈ విలువ రూ.20వేల కోట్లకు చేరే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. రొయ్య పిల్లలతోనూ భారీ ఆదాయం సమకూరుతున్నది. ఐదేండ్లలో రూ.38.82 కోట్ల ఖర్చుతో 18.31 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దీని ద్వారా రూ.1,048.66 కోట్ల విలువైన రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి.
సీఎం కేసీఆర్ ఆలోచనల ఫలితమే : సీఎం కేసీఆర్ ఆలోచనల ఫలితమే ఇప్పుడీ మత్స్యరంగం అభివృద్ధి. ఒకప్పుడు దయనీయ స్థితిని ఎదుర్కొన్న మత్స్యకారులు ఇప్పుడు సగర్వంగా జీవిస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ ఈ పథకాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి మత్స్యకారుడు ఆర్థికంగా, సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం. • తలసాని శ్రీనివాస్ యాదవ్, మత్స్యశాఖమంత్రి