ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికతత్వం దాని ప్రత్యేకతలు. కొన్ని సార్లు స్వేచ్ఛ అపరిమితం అనిపిస్తుంది. కానీ, ప్రజాస్వామ్యం విశేష గుణం పారదర్శకత, జవాబుదారి తనం. ప్రజల ద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు, పరిపాలనలో కీలకమైన అధికారులు ప్రజలకు జవాబుదారులు. కానీ, ప్రస్తుత ప్రజాస్వామ్యంలో పారదర్శకత కంటికి కనిపించని బ్రహ్మపదార్థం అయిపోయింది. జవాబుదారి తనం కొరవడింది. ఇది జగమెరిగిన సత్యం. మనలాంటి అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి వాటిని ఆశించడాన్ని ప్రజలు ఏనాడో మరచిపోయారు. ఐదేళ్ళకోసారి వచ్చే ఓటు ఆయుధాన్ని వినియోగించడంలోనూ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో మనం దురదృష్టకరంగా జీవిస్తున్నాం.
ఇలాంటి సంధి, సంధిగ్ధ కాలంలో సందర్భంగానో, అసందర్భంగానో కొన్నిఅద్భుతాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి సిఎం కెసిఆర్ ద్వారా జరిగింది. సెప్టెంబర్ 1, 2018 న కెసిఆర్, హైదరాబాద్ శివారు కొంగరకొలన్ లో ప్రగతి నివేదిక సభ పెట్టారు. ఆయన తన ప్రభుత్వ కాలంలో ఏమేమి చేశారో ప్రజలకు వివరించారు. ఆయన్ని అనుకరిస్తూ, అనుసరిస్తూ, చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, తన ప్రతి ఏడాది పదవీ కాలానికి చేసిన అభివృద్ధి నివేదికను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని ఇనుమడింప చేస్తూ కెసిఆర్ చేసిన శ్రీకారానికి కొనసాగింపు ఒరవడిని, రంజిత్ రెడ్డి మూడేళ్ళుగా నిలుపుతున్నారు.
చేవెళ్ళ మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు భిన్నమైంది. ఒకవైపు వెనుకబాటుతనం – మరోవైపు అటవీ ప్రాంతం, అభివృద్ధి ప్రాంతం… గ్రామీణ – పట్టణ – నగర సంస్కృతి… ఇదో విభిన్నమైన నియోజకవర్గం.
2009లో నియోజకర్గాల పునర్విభజనలో ఏర్పడ్ల చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీల్లో వికారాబాద్ అటవీ ప్రాంతమున్న నియోజకవర్గం, పరిగి, తాండూరు అత్యంత వెనుకబడ్డ నియోజకర్గాలు. శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం నియోజకవర్గాలు అధునికతను సంతరించుకున్న నగర నియోజకవర్గాలు. దీంతో ఇక్కడ చేయాల్సిన అభివృద్ధికి కూడా ఇందుకు తగ్గట్లుగా విభిన్నంగానే ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకుని, ప్రాధాన్యతలు గుర్తించుకొని, ప్రాధామ్యాలు నిర్ణయించుకుని, ప్రణాళికలు రూపొందించుకుని అమలుకు ఉపక్రమించాలి. ఇందుకు ప్రజా ప్రతినిధికి తన ప్రాంతంపై అవగాహన, ప్రజలపై ప్రేమ, అభివృద్ధిపై ఆర్తి ఉండాలి. అభివృద్ధికి ఆస్కారాలను, వనరులను గుర్తించాలి. ఆతర్వాత వాటిని తగిన రీతిలో తెస్తూ, పని చేస్తూ పోవాలి. బహుషా… ఇవన్నీ బాగా ఒంటపట్టించుకున్నందున కాబోలు! కెసిఆర్ ఇచ్చిన, తనకు వచ్చిన అవకాశాన్నిపూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ నిధులు తెచ్చి రంజిత్ రెడ్డి, చేవెళ్ళపై తనదైన ముద్ర వేస్తున్నారు.
తాను, ఎంపీగా గెలిచిన నాటి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ, ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ… ప్రతిక్షణం చేవెళ్ళ ప్రజలే ప్రాణంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
యాక్సిడెంట్లకు ఆలవాలంగా నిలిచిన అప్పా జంక్షన్ నుండి మన్నే గూడ వరకు 4 లైన్ల రోడ్డుకు కేంద్రాన్ని ఒప్పించి వెయ్యి కోట్లు విడుదల చేయించారు. తన పార్లమెంట్ పరిధిలో 350 గ్రామాల్లో సిసి రోడ్లు వేయించారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా సీఎం కెసిఆర్ ని ఒప్పించి, 111 జీఓని రద్దు చేయించారు. మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయించారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లోకి మార్పించారు. కరోనా కష్ట కాలంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ని ఇచ్చారు. తన తండ్రి దివంగత రాజారెడ్డి పేరున ఆర్ ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 18న తన పుట్టిన రోజు సందర్భంగా ఆ ఫౌండేషన్ ద్వారా 105 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ని కెటిఆర్ చేతుల మీదుగా అందచేశారు. వేలాది మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి బలవర్ధక ఆహారం, పాలు, గుడ్లు అందచేశారు. పార్లమెంట్ పరిధిలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్మార్ట్ టీవీని బహూకరించి, ఉచితంగా ఆన్‌లైన్ క్లాసులు చెప్పించారు. మన ఊరు – మన ఆరోగ్యం పేరుతో ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కీలకమైన 8 రకాల వైద్య సేవలను, మందులను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులు అందజేశారు.ఇవే కాక పిల్లలలో కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీని పెంపొందించడానికి, స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు, ముగ్గుల పోటీలు, యువతలో మానసిక ఒత్తిడి తగ్గించడానికి వివిధ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా చెప్పించే చదువులు, రకరకాల ప్రోత్సాహకాలకు లెక్కేలేదు. నియోజకవర్గంలో వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. అన్నా! కష్టం ఉందంటే చాలు… నేనున్నానని వారి వెన్నంటే ఉంటున్నారు.
తన ఎన్నికల నినాదం అందుబాటు – అభివృద్ది. సరిగ్గా అదే మాట ను బాటగా చేసుకుని, నమ్మిన ప్రజలకు న్యాయం చేసే వ్యక్తిగా విలక్షణమైన రాజకీయ నాయకుడిగా ఎంపీ రంజిత్ రెడ్డి ఎదుగుతున్నారు.
ప్రత్యేక కధనం: సాయి సందీప్ తేజ మార్గం