(జూన్ 3న రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం విశ్లేషణ)
మరి కొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తేలనున్న తరుణంలో నిజామాబాద్ ఎంపీ స్థానంలో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం గురించి ఆసక్తికర విశ్లేషణ. తుఫాను లాంటి ఉధృతమైన మోదీ గాలిని జీవన్ రెడ్డి ధీటుగా ఎదుర్కొన్నారు. నిజామాబాద్ ఫలితంలో గల్ఫ్ ఓటు బ్యాంకు కీలకం కానున్నది. గల్ఫ్ అంటే… అంతు పట్టని లోతు కలిగిన సముద్ర అగాధము అని అర్థం. ఈ ఎన్నికల సందర్భంలో… గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న మన ప్రవాసుల అంతరంగం కూడా అంతుపట్టని విధంగానే ఉంది.
జూన్ 1న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు, గత మూడు రోజులుగా సాగుతున్న విశ్లేషణలు, వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళిని గమనిస్తే… కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డికి ఆశించిన మేరకు గల్ఫ్ కార్మికుల మద్దతు లభించలేదని తెలుస్తోంది. గల్ఫ్ ప్రవాసుల సమస్యలపై ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న జీవన్ రెడ్డి తనకు గల్ఫ్ ఓటు బ్యాంకు మద్దతు ఎక్కువగా ఉంటుందని భావించారు.
గల్ఫ్ కార్మికులకు హామీలు ఇచ్చి మోసం చేసిన బీఆర్ఎస్ పై వ్యతిరేకతలో కాంగ్రెస్ కు అనుకూలం కావాల్సిన పరిస్థితి ఉండే. కానీ బీఆర్ఎస్ అసలు పోటీలో లేని స్థిలోకి జారిపోవడం వల్ల ఆ వ్యతిరేక ఓటు అనుకున్నంతగా కాంగ్రెస్ కు బదిలీ కాలేదు. అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడం వల్ల పరిస్థితిలో మార్పు చోటు చేసుకున్నది.
మే 5-6 నాటికి ఉన్న సమాచారం ప్రకారం… నిజామాబాద్ పార్లమెంట్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు 44 శాతం, బీజేపీకి 39 శాతం, బీఆర్ఎస్ కు 12 శాతం, ఇతరులకు 5 శాతం ఉన్నట్లు ఒక శాంపిల్ సర్వే అంచనా వేసింది. కానీ మే 13 పోలింగ్ నాటికి ఒకటి రెండు రోజుల ముందు పరిస్థితి కొంత మారినట్లు తెలిసింది. కాంగ్రెస్ కు ఉన్న 44 శాతం గల్ఫ్ ఓటు బ్యాంకును జీవన్ రెడ్డి వ్యక్తిగత ఛరిష్మాతో నిలుపుకోగలిగినా, బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడటం వలన బీజేపీ 39 శాతం నుంచి ఎదిగి కాంగ్రెస్ ను స్వల్పంగా అధిగమించినట్లు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ 17,357; నిజామాబాద్ రూరల్ 23,721; బోధన్ 16,897; ఆర్మూర్ 21,586; బాల్కొండ 22,879; కోరుట్ల 23,186; జగిత్యాల 22,510 మంది మొత్తం కలిపి 1,48,136 వలస కార్మికులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నట్లు ఒక అంచనా.
నిజామాబాద్ లో ప్రధాన పోటీ సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి ల మధ్య పోరు హోరాహోరీ జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ నామమాత్రానికి పడిపోయింది. గల్ఫ్ దేశాలలో సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీ నిజామాబాద్ కోసం తన శక్తినంతా ఉపయోగించింది. ఇండియన్ పీపుల్స్ ఫోరం, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా, యోగా, ధార్మిక తదితర సంస్థల సహకారం తీసుకున్నది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వలస కార్మికులలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వంద మంది బీజేపీ అభిమానులను గుర్తించినట్లు సమాచారం.
వీరందరూ ఒక టీంగా ఏర్పడి ఇండియా లోని వారి వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేయించి బీజేపీకి ఓటు వేయాలని చెప్పించినట్లు సమాచారం. ఈ విధంగా వేలాది మందితో గల్ఫ్ నుంచి గ్రామాలకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు అంచనా. జాతీయ వాదం, దేశ భక్తి, మాతృభూమి అనే నినాదాలతో ప్రవాస భారతీయుల్లో బీజేపీ సెంటిమెంట్ రగిలించగలిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 16 న హైదరాబాద్ లో గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశంలో గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీ పై స్పష్టమైన హామీ ఇవ్వడం, అంతకు ముందు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లింపును ప్రారంభించడంతో గల్ఫ్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
దీనికి తోడు గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (జిడబ్ల్యూఏసి) అధ్యక్షులు దొనికెని క్రిష్ణ రాజకీయాలకు అతీతంగా నిజామాబాద్ పార్లమెంట్ లో టి. జీవన్ రెడ్డికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం విశేషం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గల్ఫ్ ఎన్నారై విభాగం నాయకులు, పలువురు గల్ఫ్ సోషల్ లీడర్స్ జీవన్ రెడ్డికి మద్దతుగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రచారం చాప కింద నీరులా సాగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి పెద్దగా చేసింది ఏమీ లేదని గల్ఫ్ సంఘాలతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు విజయవంతంగా ప్రచారం చేయగలిగారు.
ఏది ఏమైనా… గల్ఫ్ కార్మికుడు అభిమన్యుడు కాదు… అర్జునుడై ఈ పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ పద్మ వ్యూహాన్ని ఛేదించాడు. గల్ఫ్ కార్మికుల అంశాన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ఎజెండాలో చేర్చి, చర్చకు తెరలేపిన వ్యూహకర్తలకు వందనాలు. చివరగా గల్ఫ్ కార్మికుడే విజేత !
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్