Health Tips : ప్రస్తుతం నవంబర్ రెండవ వారంలోకి వచ్చేశాము. రాను రాను ఉష్ణోగ్రతలు తగ్గుతూ… చలి తీవ్రత మరింతగా పెరుగుతుంది. చలికాలం హృదయ సమస్యలతో బాధపడే వారికి ఎంతో కీడు చేస్తుందని నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గుండె పోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల రక్త సరఫరా తగ్గి గుండెకు ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది. దీంతో శరీరానికి రక్తం, ఆక్సిజన్‌ను అందించడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు మరింతగా తలెత్తుతాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు సమస్యల నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం…
- చలికాలంలో నీరు సరిపడిన మోతాదులో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
- చలి తీవ్రతను తట్టుకునేలా ఉన్ని దుస్తువులను ఎక్కువగా ధరించాలి.
- ముఖ్యంగా తల, చేతులు, పాదాలను కవర్ చేస్తూ క్యాప్, గ్లౌజ్‌లు వంటి వాటిని ధరించాలి.
- అవసరమైతే తప్ప బయటకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిది.
- మరీ ముఖ్యంగా ఉదయం 8 గంటల లోపు, రాత్రి 6 గంటల తర్వాత బయట తిరగకుండా ఉండాలి.
- మద్యం వంటి వ్యసనాలకు బానిసలైతే వాటిని తగ్గించటం మంచిది. సాధ్యమైనంత వరకు మద్యాన్ని మానుకోవాలి. ఆల్కాహాల్ శరీరాన్ని వేడిపరుస్తుంది. అపై చల్లటి వాతావరణం కారణంగా గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉంటుంది.
- రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. బీపీలో మార్పులు కనిపిస్తే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
- చలికాలంలో వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం మంచిదని… దీనివల్ల గుండె ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు.