Health ఆహారంలో పప్పు దినుసులను భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని చెబుతుంటారు. కానీ.. పప్పులను దూరం పెడుతుంటారు…చాలా మంది. కందులు, పెసర్లు, శనగలు, బఠానీల వంటి పప్పులను తక్కువగా తీసుకుంటూ….ఇతర ఆహార పదార్థాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు. కానీ… తరచుగా వీటిని ఆహారంలో తీసుకోవాలని సూచిస్తుంటారు… వైద్య నిపుణులు. పప్పుల్లో కొవ్వు తక్కువగా ఉండడమే కాక…కొలెస్ట్రాల్ అసలే ఉండదు. అందుకే… ఇవి గుండె ఆరోగ్యానికి మంచి మిత్రులు. అంతే కాదు… పెద్దపేగు, ప్రొస్టేట్, జీర్ణాశయ, పాంక్రియాస్ క్యాన్సర్ల వంటి రకరకాల క్యాన్సర్లను సమర్థవంతంగా నివారించడంలోనూ… పప్పులు బాగా తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పప్పుల్లో పిండి పదార్థాల మోతాదు ఎక్కువగా ఉంటాయని కొందరు భయపడుతుంటారు. కానీ ఇవి పీచుతో కూడుకొని ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అత్యవసరం అంటున్నారు వైద్యులు. అంతే కాదు… ఫోలేట్, ఐరన్, జింక్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందించటంలో కీలకంగా వ్యవహరిస్తాయంటున్నారు.
చాలా మంది తమ ఆహారంలో అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటూ… కూరల్ని తక్కువగా తీసుకుంటుంటారు. కానీ.. సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలంటే…అన్నం కంటే కూరల్నే ఎక్కువగా తీసుకోవాలంటారు. ముఖ్యంగా… పప్పుల్ని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఒక కప్పు ఉడికించిన పప్పుల్లో సుమారు 230 కేలరీల శక్తి లభిస్తే… 17.9 గ్రాముల ప్రొటీన్, 15.6 గ్రాముల పీచు, 0.8 గ్రాముల కొవ్వు లభిస్తాయి. అదే ఒక కప్పు అన్నంతో 4.5 గ్రాముల ప్రొటీన్, 45.8 గ్రాముల పిండి పదార్థాలు, 3.5 గ్రాముల పీచు లభిస్తాయి. కాబట్టి అన్నం పరిమాణాన్ని కాస్త తగ్గించి పప్పుల మోతాదు పెంచుకుంటే ఇంకా మంచిది.
గ్యాస్ ఇబ్బంది పప్పులతో ఎన్ని లాభాలున్నా… కొన్ని ఇబ్బందులూ లేకపోలేదు. పప్పులు తినడం వల్ల చాలా మందిలో కడుపుబ్బరం, కింద నుంచి గ్యాస్ వెళ్లడం ఇబ్బందికి గురి చేస్తాయి. కొందరికి పప్పుల్లోని లెక్టిన్ పడకపోవచ్చు. దాంతో కడుపు నొప్పి, వికారం వంటి సంస్యలూ తలెత్తొచ్చు. అయితే పప్పులను నానబెట్టటం, ఉడికించటం, మొలకెత్తించటం వంటి పద్ధతులతో లెక్టిన్ల మోతాదులను తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు… వైద్యులు.