లోక నాయకుడు పద్మశ్రీ డా.కమల్ హాసన్ కేవలం ఒక నటుడు కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పరమక్కుడిలో 1954, నవంబర్ 7న రాజ్యలక్ష్మి, శ్రీనివాసన్ దంపతులకు నాలుగో సంతానంగా పుట్టిన కమల్, మూడున్నరేళ్ల అతి పిన్న వయసులోనే ‘కళత్తూర్ కన్నమ్మ’ చిత్రంలో నటించి బాల నటుడిగా తొలి చిత్రంతోనే జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆయన మూడుసార్లు జాతీయ పురస్కారాన్ని పొందారు. ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేషన్, నగేష్, జెమినీ గణేశన్ వంటి దిగ్గజాలు నిర్మించిన చిత్రాలలో బాల నటుడుగా నటించారు కమల్ హాసన్. బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనూగు మీసాల వయసులో నృత్య దర్శకుడిగా పని చేశారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో కమల్ కు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘకాలంపాటు గురు-శిష్య సంబంధంగా కొనసాగింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందారు. గీత రచయితగా సైతం ప్రతిభను ప్రదర్శించారు కమల్ హాసన్. భరత నాట్యాన్ని ప్రదర్శించడంలో ఆయన తనకు తనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగారు కమల్ హాసన్. 70వ దశాబ్ధంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు. శ్రీదేవితో ఆయన నటించగా తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో ఘన విజయం సాధించిన ’16 వయదినిలె’ చిత్రం 23 ఏళ్ళ వయసులో యువ కథానాయకుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాల్లో కలసి నటించారు. అయితే, కమల్ హాసన్ కీ, ఆయన అన్నయ్య చారు హాసన్ కీ, కమల్ కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ ల పేరు చివరన హాసన్ అనేది ఎలా వచ్చిందో తెలుసా? కమల్ తండ్రి శ్రీనివాసన్ ఒక మిత్రుడితో తమకు వున్న అనుబంధానికి గుర్తుగా కొడుకుల పేర్ల చివర హాసన్ అని పెట్టారు. ఇప్పుడు అది ఎంతగా ప్రఖ్యాతి పొందింది అంటే హాసన్ అనగానే కమల్ ఫ్యామిలీ గుర్తొచ్చేంతగా…