ఒక సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడే ఆ సినిమా మీద యూనిట్ మొత్తం కోటి ఆశలు పెట్టుకుంటుంది. సినిమా విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ అహర్నిశలూ శ్రమిస్తారు. నిజానికి సినిమా జయాపజయాలు దైవాధీనాలు. సినిమా నిర్మాణమంటే జూదంలాంటిదనే నిజాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే, సినిమాలో కంటెంట్ వున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎందుకు ఫ్లాప్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. అలాగే, సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా ఒక్కోసారి హిట్టయిపోతుంది. ఇకపోతే, ఒక హీరో క్రమంగా ఎదుగుతూ వచ్చి పెద్ద స్థాయిలో వుండి, నిర్మాతలు భారీగా బడ్జెట్ వెచ్చించి చేసే సినిమాలు తొలి అడుగుల్లోనే ప్రేక్షకుల నుండి నిరసనల్ని ఎదుర్కొంటే వారికి కలిగే భయం అంతాయింతా కాదు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం.
బాలీవుడ్ లో ప్రస్తుతం బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీని దెబ్బకు ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఇది మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరకు వచ్చింది. ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్’ విడుదల కావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలయింది. అయితే, ఈ ట్రైలర్ పై పలువురు పెదవి విరుస్తున్నారు.
రామాయణంను ఒక రేంజ్ లో తీస్తారనుకుంటే చివరకు గ్రాఫిక్స్ సినిమా తీశారేంటని విమర్శిస్తున్నారు. బొమ్మల సినిమాలా ఉందని అంటున్నారు. అంతేకాదు, రావణాసురుడు, హనుమంతుడు ఎలా వుంటారో తెలియదా, వారిని అలా చూపిస్తారా? అని మండిపడుతున్నారు. బ్యాన్ ఆదిపురుష్, బాయ్ కాట్ ఆదిపురుష్ అనే హ్యాష్ ట్యాగ్ లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయడం బాలీవుడ్ కు అలవాటయిందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మన ‘ఆదిపురుష్’ని ఆ శ్రీరామచంద్రుడే రక్షించాలి.