సమాచార లోపంవల్లో, మితిమీరిన స్వేచ్ఛవల్లో ఒక్కోసారి సోషల్ మీడియాలోని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అతిగా ప్రవర్తించి దెబ్బ తింటూంటాయి. ప్రస్తుతం ఉత్తరాది యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయి. ఫిట్ నెస్ కి మారుపేరు, కరాటే లో పట్టున్న మనిషి, అనేక చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సైతం రాణిస్తున్న సుమన్ చనిపోయారంటూ కొన్ని ఉత్తరాది యూట్యూబ్ ఛానెల్స్ ప్రచారం చేశాయి. దీంతో తెలుగు సినీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇది నిజమేనా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
ఈ విషయం కాస్తా సుమన్ వరకూ వెళ్లింది. నిజానికి ప్రస్తుతం తాను బెంగళూరులో షూటింగులో వున్నాననీ, తాను క్షేమంగానే వున్నాననీ ఆయన తెలిపారు. ఆ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేస్తానని సుమన్ హెచ్చరించారు. అందుకే, ఏదైనా ఒక వార్తను ప్రసారం చేసే ముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవడం ఎవరికైనా మంచిది. అయితే, ఆ ఛానెల్స్ ఇలా ఎందుకు ప్రవర్తించాయనేది మాత్రం అర్థం కావడం లేదని చాలామంది అంటున్నారు. పూర్తిగా విచారణ జరిగితే తప్ప నిజానిజాలు బయటకు రావన్నది నిర్వివాదాంశం.