ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ జోరును అనేక సంస్థలు చాటి చెప్తున్నాయి. ఐటీ జాబ్స్‌తోపాటు.. ఇతర రంగాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లోనూ హైదరాబాద్ స్థిరంగా ముందుకు సాగుతున్నదని పేర్కొంటున్నాయి. హైదరాబాద్ ఐటీ కొలువుల కలల మజిలీగా మారుతున్నదని కొద్ది రోజులక్రితమే నౌకరీడాట్‌కామ్ పేర్కొనగా.. తాజాగా మాన్‌స్టర్‌డాట్‌కామ్, ఇండీడ్ పోర్టల్స్ సైతం అదే విషయాన్ని నొక్కి చెప్పాయి.
దేశంలో అత్యధికంగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్న నగరాల జాబితాలో హైదరాబాద్ మూడోస్థానంలో నిలిచినట్టు ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఇండీడ్’ వెల్లడించింది. దేశంలో ఎక్కువ ఐటీ ఉద్యోగాలు ఇస్తున్న నగరాలు, ఎక్కువ వేతనాలు లభిస్తున్న ఉద్యోగాలు, ఎక్కువగా ఉద్యోగాలు దొరుకుతున్న విభాగాలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలతో ఈ పోర్టల్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ నియామకాల్లో 32%తో బెంగళూరు అగ్రస్థానాన్ని ఆక్రమించగా.. 11%తో పుణె రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్త నియామకాల్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉన్నది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది దేశీయ ఐటీ రంగంలో నియామకాల పెరుగుదల స్థిరంగా కొనసాగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. 2019 సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది ఉద్యోగ కల్పన 26% పెరిగిందని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు డిమాండ్ అధికంగా ఉన్నదని తెలిపింది.
కొన్ని రకాల పోస్టులకు నిపుణుల కొరత
————————–
సపోర్ట్ ఎస్కలేషన్ ఇంజినీర్, బిజినెస్ ఆబ్జెక్ట్స్ డెవలపర్, మైక్రోసాఫ్ట్ సర్వర్ ఇంజినీర్, అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజినీర్, టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొఫెషనల్ లాంటి కొన్ని రకాల పోస్టులకు సరైన అభ్యర్థులు దొరకడం లేదని, దీంతో ఆయా ఖాళీల్లో మూడింట రెండొంతులు రెండు నెలలకుపైగా భర్తీకాకుండా మిగిలిపోతున్నాయని ‘ఇండీడ్’ పేర్కొన్నది. అత్యధిక వేతనాలు అందుకొంటున్నవారిలో సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌లు, టెక్నికల్ లీడ్, డాటా ఇంజినీర్, సాప్ కన్సల్టెంట్, సేల్‌ఫోర్స్ డెవలపర్లు ఉన్నట్టు తెలిపింది.
కరోనా విపత్తు తర్వాత దేశంలో డిజిటలైజేషన్ శరవేగంగా సాగుతున్నది. దీని ఫలితంగా సమీప భవిష్యత్తులో ఐటీ నియామకాలు పెరుగుతూనే ఉంటాయి. ఆన్‌లైన్ లావాదేవీలు, గ్రామీణ ప్రాంతాలకు నెట్‌వర్క్ అందించడం లాంటి కీలక రంగాల్లో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు చూపేవారికి మంచి అవకాశాలు ఉంటాయి.
శశికుమార్, ఇండీడ్ సేల్స్ హెడ్
ఇతర నియామకాల్లోనూ హైదరాబాద్ హవా • బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలో తగ్గిన అవకాశాలు • నెలవారీ జాబ్ ఇండెక్స్‌లో మాన్‌స్టర్‌డాట్‌కామ్ వెల్లడి, ఐటీతోపాటు ఇతర రంగాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లోనూ హైదరాబాద్ సుస్థిరంగా ముందుకు దూసుకెళ్తున్నది. హైదరాబాద్‌తో పోలిస్తే బెంగళూరు, కోల్‌కతా, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో గత నెల ఉద్యోగ నియామకాలు తగ్గినట్టు నెలవారీ జాబ్ ఇండెక్స్‌లో ‘మాన్‌స్టర్ డాట్ కామ్’ వెల్లడించింది. కరోనా లాక్‌డౌన్ల వల్ల గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్), కోచ్చి, ముంబై నగరాల్లో ఉద్యోగ నియామకాలు కొంత మేర తగ్గినప్పటికీ ఈ ఏడాది మళ్లీ స్థిరంగా పెరుగుతున్నాయని పేర్కొన్నది. గత నెలలో కోయంబత్తూర్, జైపూర్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ నియామకాలు కొంత మేర పెరిగినట్టు తెలిపింది. ప్రసుత్తం దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఉద్యోగ నియామకాలు పుంజుకొంటున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పో ల్చితే అక్టోబర్‌లో నియామకాల డిమాండ్ 3 శా తం క్షీణించిందని, అయినప్పటికీ గత 6 నెలల్లో ఉద్యోగాల డిమాండ్ 9% పెరిగిందని మాన్‌స్టర్ డాట్‌కామ్ జాబ్ ఇండెక్స్ స్పష్టం చేసింది.