★ కారు పల్టీలు కొట్టినా… ప్రాణం కాపాడిన సీటు బెల్టు ★ ఉచిత వైద్యానికి ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ హామీ
కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే ఆశయంతో 2023లో సౌదీ అరేబియాకు వలస వెళ్లిన ఒక యువకుడి కలలు చెదిరిపోయాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన ప్యాట్ల సాయిబాబ (23) ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం తన కుమారుడు సాయిబాబను సౌదీ నుంచి హైదరాబాద్ కు తెప్పించాలని ప్యాట్ల గంగు తన పెద్ద కుమారుడు నవీన్ తో పాటు మంగళవారం హైదరాబాద్ బేగంపేట లోని ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు.
ప్రజావాణి నోడల్ అధికారి, సీనియర్ ఐఏఎస్ దివ్యా దేవరాజన్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. పేషేంట్ సాయిబాబ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం లేదా ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ (ఎల్ఓసీ) ద్వారా ఉచిత వైద్యం అందించాలనే విజ్ఞప్తికి దివ్యా దేవరాజన్ సానుకూలంగా స్పందించారు.
సాయిబాబ జూన్ 16న రియాద్ నుంచి దమ్మామ్‌కు తనే స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో కారు టైరు పేలిపోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. వాహనం పల్టీలు కొడుతూ పలుచోట్ల దెబ్బతింది. సీటు బెల్ట్ ధరించినందువల్ల ప్రాణాపాయం తప్పింది. గాయాలపాలైన సాయిబాబను హఫూఫ్ లోని కింగ్ ఫహాద్ హాస్పిటల్ కు తరలించగా, తలకు శస్త్ర చికిత్స చేసి, జూన్ 25న డిశ్చార్జి చేశారు.
సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఈస్ట్రన్ రీజియన్ అధ్యక్షులు రంజిత్ చిట్టలూరి బృందం సాయిబాబ కు సహాయపడుతూ మానవతా స్ఫూర్తిని చాటారు. పేషేంట్ ను సౌదీ నుంచి హైదరాబాద్ కు తరలించడానికి ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, రంజిత్ తో సమన్వయంతో పని చేస్తున్నారు.