Health దగ్గు…ఎక్కువ మందిలో ఉన్నప్పుడు అదేపనిగా వస్తుంటే చాలామంది ఆపుకోడానికి ప్రయత్నిస్తుంటారు. దగ్గు అనేది సాధారణంగా ఊపిరితిత్తుల సమస్య. చాలా జబ్బుల్లో అదో లక్షణం. అదే సమయంలో దగ్గడం అనేది మనల్ని కొన్ని సమస్యల నుంచి రక్షిస్తుంది కూడా. అందుకే దగ్గు వస్తున్నప్పుడు ఎట్టి పరిస్థతుల్లోనూ ఆపుకోవడం చేయరాదు.
దగ్గినప్పుడు శ్వాసనాళాల్లో గాలి చాలా వేగంగా బయటకు వస్తుంటుంది. దాంతో దేహంలోపల ఉన్న అక్కర్లేని స్రావాలు బయటకు వెళ్లిపోతాయి. ఊపిరితిత్తుల్లో వుండే అవాంఛిత స్రావాలు అక్కడే ఉండిపోయినా.. అక్కడి వాయునాళాల్లో అడ్డుగా మారినా.. విపరీతంగా దగ్గు వస్తుంది. అలాంటప్పుడు దగ్గితే కఫం బయటకు పోయి లోపల అంతా క్లీన్ అవుతుంది. కాబట్టే దగ్గును ఎట్టి పరిస్థతుల్లోనూ ఆపుకోకూడదు.
విపరీతంగా దగ్గు వస్తున్నా.. పొడి దగ్గు వచ్చి గొంతు నొప్పి పుట్టినా.. ఇలాంటి సందర్భాల్లో తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఎల్లవేళలా దగ్గును చెడుగానే చూడకూడదు. టీబీ వంటి తీవ్రస్థాయి సమస్యలు ఉన్నప్పుడే దగ్గు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ సామాన్యంగా వచ్చే దగ్గుకు భయపడక్కర్లేదు. ఇది కొన్నిసార్లు మనకు మంచే చేస్తుంది. ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దగ్గు సమస్య వేధిస్తుంది.. లేదా ఎక్కువగా స్వీట్స్, శీతల పానీయాలు తీసుకున్నా దగ్గు సమస్యతో బాధపడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దగ్గు ఆపకుండా వస్తుంది.. అలాంటప్పుడు ఛాతిలో విపరీతమైన నొప్పి పుడుతుంది. ఈ సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి.. తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.