మహిళా భద్రతా విభాగం, అదనపు డిజిపి శ్రీమతి. శిఖా గోయెల్, ఐపిఎస్., గారు రాచకొండ పోలీస్ కమీషనర్ శ్రీ డి ఎస్ చౌహాన్ ఐపిఎస్., గారి సమక్షంలో, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) / ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ఎల్ బి నగర్‌ను మరియు అవగాహన ప్రచార కార్యక్రమాల కోసం ఔట్‌రీచ్ వ్యాన్‌ను ప్రారంభించారు.
ఉప్పల్‌లో జాయింట్ సీపీ రాచకొండ శ్రీ వి.సత్యనారాయణ ఐపీఎస్., కుషాయిగూడలో డీసీపీ (అడ్మిన్) శ్రీమతి పి. ఇందిర, మీర్‌పేటలో డీసీపీ ఎల్‌బీ నగర్ శ్రీమతి బి. సాయిశ్రీ, పహాడీషరీఫ్ లో డీసీపీ సైబర్ క్రైమ్స్ శ్రీమతి బి. అనురాధ ఐపిఎస్., మరియు డీసీపీ మహేశ్వరం శ్రీ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కమిషనరేట్లో ఒకేసారి 4 సీడీఈడబ్ల్యూ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీమతి శిఖా గోయెల్ ఐపీఎస్ మాట్లాడుతూ.. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మహిళల సౌకర్యార్థం మూడు కమిషనరేట్ల పరిధిలో 26 సీడీఈడబ్ల్యూ కేంద్రాలను ప్రారంభించనున్నామని, భవిష్యత్తులో ప్రతి ప్రధాన సబ్ డివిజన్‌లో సీడీఈడబ్ల్యూ సెంటర్ ఉంటుందని తెలిపారు. రాచకొండలో 5 సీడీఈడబ్ల్యూ కేంద్రాల ప్రారంభోత్సవంతో 15 సీడీఈడబ్ల్యూలు పని చేయగా, వచ్చే నెల మధ్య నాటికి మొత్తం 26 సీడీఈడబ్ల్యూలు పని చేయనున్నాయి. “ఇప్పటివరకు స్థానిక పోలిస్ స్టేషన్ లలో లేదా భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ జరిగింది,
అయితే కౌన్సెలింగ్ చాలా ప్రొఫెషనల్ సబ్జెక్ట్ మరియు సరైన రీతిలో సహాయం పొందడానికి కౌన్సెలర్‌లను నియమించాలని నిర్ణయించడం జరిగింది, పోలీసింగ్‌ను ఇంటి వద్దకు తీసుకురావడానికి కేంద్రాలు దగ్గరగా ఉండాలని నిర్ణయించడం జరిగింది” అన్నారు. తద్వారా, మహిళలు దూరంగా ఉన్న స్థానిక పోలిస్ స్టేషన్ లేదా భరోసా సెంటర్‌కు వెళ్లనవసరం లేదు, వారు తమ ఇంటికి ఇంటికలో ఎక్కడికైనా రావచ్చు. అందుకే మూడు కమిషనరేట్లలో సీడీఈడబ్ల్యూ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు.
భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువగా నమోదు కాని నేరాలలో గృహ హింస ఒకటి అని శిఖా గోయల్ గారు పేర్కొన్నారు. సన్నిహిత భాగస్వాముల వల్ల జరిగే హింసను మహిళలు ఫిర్యాదు చేయడం లేదన్నారు. వైవాహిక సంబంధ కేసులలో సీడీఈడబ్ల్యు కేంద్రాల ద్వారా కుటుంబాలను ఒకచోట చేర్చడానికి ప్రయత్నం చేయబడుతుంది మరియు మహిళలు సరైన మార్గదర్శకత్వం మరియు సహాయం పొందవచ్చు అన్నారు.
ఎక్కువ హింస జరిగినప్పుడు లేదా ఫిర్యాదుదారుల మధ్య రాజీ కుదరని చోట కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటారు. అన్ని సీడీఈడబ్ల్యు కేంద్రాలు తెలంగాణ మహిళా భద్రతా విభాగం యొక్క ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ పర్యవేక్షణలో ప్రామాణిక ఫారమ్‌లు, ప్రోటోకాల్‌లతో ఒకే పద్ధతిలో పనిచేయడం జరుగుతుంది.
రాచకొండ కమిషనర్ శ్రీ డిఎస్ చౌహాన్, ఐపిఎస్., గారు మాట్లాడుతూ… సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో సిడిఇడబ్ల్యు కేంద్రాల ఏర్పాటు ఒక భాగమని పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఏడీజీపీ మహిళా భద్రత, కమిషనర్లతో జరిగిన సమావేశంలో మహిళా సాధికారత, మహిళా రక్షణ, మహిళల భద్రత, గృహ హింస/బాహ్య హింస లేదా ఎలాంటి వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది అని పేర్కొన్నారు. అందుకే, కమిషనరేట్‌లో ఏకకాలంలో 5 సిడిఇడబ్ల్యు కేంద్రాలు ప్రారంభించబడ్డాయి మరియు త్వరలో మరో 2 ప్రారంభించబడతాయి అన్నారు.
బహిరంగ లేదా ఆన్‌లైన్ ఈవ్ టీజింగ్/వేధింపులను అరికట్టేందుకు సైబర్ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు మరియు షార్ట్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిడిఇడబ్ల్యు కేంద్రాలు, షీ టీమ్ బృందాలు, మహిళల భద్రత, ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన కల్పించేందుకు ఆడియో-వీడియో వ్యాన్ ఉపయోగించబడుతుంది అని పేర్కొన్నారు. ఆన్‌లైన్ మరియు బహిరంగ సమాజంలో బాలికలు మరియు మహిళల భద్రతకు భరోసా ఇవ్వడానికి రాచకొండ కమిషనరేట్ కృషి చేస్తుందని కమిషనర్ పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత i/c మహిళా భద్రత డీసీపీ శ్రీబాల, ఏసిపి ఎల్ బి నగర్ శ్రీధర్ రెడ్డి, ఏసీపీ షీ టీమ్స్ వెంకట్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ ఎల్‌బీ నగర్ అంజి రెడ్డి, సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ మంజుల, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.