సినీరంగంలో ఓ వెలుగు వెలిగిపోయినవారు రాజకీయాల్లోకి రావడం సహజమే. కానీ, మైదానంలో బ్యాట్ తో, బంతితో వీరంగమాడే క్రికెటర్లు వెండితెరపై అడుగుపెట్టడం కొంచెం అరుదుగానే జరుగుతుందని చెప్పవచ్చు. అలాంటి ఓ అరుదైన సంఘటన ఇప్పుడు జరుగుతోంది. క్రికెట్లో ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లు గెలిపించిన టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినీరంగంలో కాలుమోపాడు. చియాన్ విక్రమ్ నటించిన ‘కోబ్రా’ సినిమాలో ఇర్ఫాన్ ఓ కీలక పాత్రలో నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ఇర్ఫాన్ నటనపై తాజా, మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా స్పందిస్తూ.. చూస్తుంటే ఇది యాక్షన్ సినిమా అనిపిస్తోందని, నీ పెర్ఫార్మెన్స్ చూడడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. నీ ప్రయాణంలో కొత్త అవతారం ఎత్తినందుకు శుభాకాంక్షలు బ్రదర్ అంటూ టీమిండియా మాజీ ఓపెనర్ రాబిన్ ఊతప్ప ట్వీట్ చేశాడు. చాలా సంతోషంగా ఉందని, ‘కోబ్రా’ను చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నాడు.
టీమిండియా యువ ఆటగాడు దీపక్ హుడా కూడా కోబ్రాలో ఇర్ఫాన్ నటనపై స్పందించాడు. ఈ ట్రైలర్ తనను ఓ దశాబ్దం వెనక్కి తీసుకెళ్లిందన్నాడు. తానో ఆల్రౌండర్నని ఇర్ఫాన్ తనతో అన్నాడని, ఇప్పుడా మాటలు నిలబెట్టుకున్నాడని పేర్కొన్నాడు. సిల్వర్ స్క్రీన్ పై ఇర్ఫాన్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టుగా వుందంటూ ట్రైలర్ ని పంచుకున్నాడు. అభిమానులు కూడా ఇర్ఫాన్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.