అభ్యుదయవాది, ఉత్తేజాన్ని రేకెత్తించే రచనలతో మహాకవి శ్రీశ్రీ ఎంతటి సంచలనాన్ని సృష్టించారో మనందరికీ తెలిసిందే…! ఆయన రచనల్లోనే కాదు, రాసే విధానంలోనూ అంతే వేగం వుండేది. అయితే, శ్రీశ్రీ సాధించిన కొన్ని ఘనతలను, రికార్డులను ఈ వీడియోలో ఒకసారి గుర్తు చేసుకుందాం…!
పద్దెనిమిదేళ్ల అతి పిన్న వయసులోనే ‘ప్రభావ’ అనే కావ్య సంపుటితో తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు శ్రీశ్రీ. శ్రీశ్రీ అనగానే చాలామందికి ఒక కవి, ఒక గీత రచయిత మాత్రమే గుర్తొస్తారు. కానీ, ఆయన తన సతీమణి సరోజతో కలసి కొన్ని సినిమాలకు మాటలు కూడా రాశారు. అంతేకాదు, ‘చెవిలో రహస్యం’ అనే సినిమాను నిర్మించారు. అయితే, అది పరాజయంపాలై ఆయనకు నిరాశను మిగిల్చింది. శ్రీశ్రీ రచించిన ‘మహా ప్రస్థానం’ 1981లో లండన్ లో ఆయన స్వదస్తూరీతో ప్రచురితమైంది. ఇకపోతే, ఏ గీత రచయిత అయినా ఒకరోజుకి ఒక పాటో, రెండు పాటలో రాస్తారేమో… కానీ, శ్రీశ్రీ ఏకంగా ఒక్కరోజులో 12 పాటలు రాసేశారంటే నమ్మగలరా? కానీ, ఇది నిజం. ఇప్పటికీ ఇది ప్రపంచ సినీ రంగంలో ఓ తిరుగులేని రికార్డుగా మిగిలిపోయింది.
ఒక సారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు రాయడానికి మైసూరుకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు విలక్షణ చిత్రాల దర్శక దిగ్గజం బి.విఠలాచార్యతో పరిచయమేర్పడింది. కన్నడలో రూపొందిన ‘కన్యాదానం’ సినిమాను తెలుగులో కూడా నిర్మించదలచి విఠలాచార్య శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నారు. అప్పుడు మైసూరులో ఒక్కరోజులోనే 12 పాటలు రాశారు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవ్వరూ అధిగమించలేకపోయారు.