సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన తాజా చిత్రం ‘పెదకాపు-1’ ప్రధాన పాత్రలో యంగ్ స్టర్ విరాట్ కర్ణను నటింపజేయాలని ధైర్యమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది సాధారణ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కాదు. పెదకాపు-1 న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి.. ఇది యంగ్ స్టర్ కి కూడా సవాల్. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ట్రైలర్ లాంచ్ చేయగా, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.
సమాజంలో సామాజిక న్యాయం లేకపోవడం వలన విప్లవాలు పుట్టుకొస్తాయి. పెదకాపు-1 ఉన్నత వర్గానికి చెందిన ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల ఆధిపత్యం ఉన్న గ్రామంలో కుల అణచివేతను ప్రజంట్ చేస్తోంది. ట్రైలర్‌లో సినిమా కథాంశాన్ని వెల్లడించే అంశాలు చాలా ఉన్నాయి. సంక్షోభం ఏర్పడినప్పుడు అది విప్లవానికి దారి తీస్తుంది, అణచివేతదారులకు వ్యతిరేకంగా ఒక సామాన్యుడు తన స్వరాన్ని వినిపించి, వారిపై హింసాత్మక యుద్ధాన్ని కూడా మొదలుపెడతాడు.
ట్రైలర్‌లో విరాట్ కర్ణ అద్భుతంగా కనిపించారు. ఫెరోషియస్ గా కనిపించిన విరాట్ సినిమాలో ఎక్స్ టార్డినరీ పెర్ ఫార్మెన్స్ కనబరిచాడని స్పష్టంగా తెలుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల బ్రిలియంట్ వర్క్ చేశారు. ట్రైలర్ లో డైలాగ్స్ ఆలోచింపజేసేలా వున్నాయి. ట్రైలర్‌లో దాదాపు ప్రతి సీక్వెన్స్‌లోనూ అదే ఇంటెన్సిటీ ఉంది. దాదాపు 2.5 నిమిషాల నిడివి గల వీడియో వైలెన్స్ తో నిండి ఉంది. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్ గా వున్నాయి. శ్రీకాంత్ అడ్డాల ప్రధాన విలన్స్ లో ఒకరిగా నటించడం ఆసక్తికరంగా వుంది. తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. విరాట్ సరసన ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటించింది.
ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందించారు. కథనాన్ని నేచురల్ గా, స్ట్రాంగ్ గా చేయడానికి డార్క్ థీమ్‌ను ఎంచుకున్నారు. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌కు మరింత బలం చేకూర్చారు. ద్వారకా క్రియేషన్స్ ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వివి వినాయక్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ నా మనసుకి చాలా దగ్గరరైన వాడు. తన రైటింగ్ సెన్సిబిలిటీస్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో రావు రమేష్ గారి పాత్ర గురించి ఛోటా చెప్పినప్పుడు అసలు ఇలాంటి పాత్రలని ఎలా రాయగలుగుతున్నాడనిపించింది. ట్రైలర్ చాలా బావుంది. సినిమా అద్భుతంగా వుంటుంది. రవీందర్ రెడ్డి గారు సినిమాపై ఇష్టం వున్న నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఇలాంటి బావ ఒకరు ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే బామ్మర్దిని హీరో చేశారు( నవ్వుతూ). ఒక కొత్త హీరో సినిమాకి ఇన్ని కోట్లు ఖర్చు చేయడం మామూలు విషయం కాదు.
నా దర్శకత్వంలో అల్లుడు శీను సినిమాకి బెల్లం కొండ సురేష్ గారు అలా ఖర్చు చేశారు. దీని తర్వాత అంత తెగింపుతో ఎలాంటి లెక్కలు లేకుండా తీసిన సినిమా పెదకాపు1. ఇది కూడా అఖండ అంత హిట్ కావాలని, విరాట్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మణిరత్నం గారి దొంగదొంగ సినిమాలో పీసి శ్రీరామ్ గారి ఫోటోగ్రఫీ నా మనసులో ముద్రించుకుపోయింది. పెదకాపు ట్రైలర్ చూస్తునపుడు అది మళ్ళీ రిపీట్ అయినట్లు అనిపించింది. చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఛోట అన్న.. రియల్లీ గ్రేట్ వర్క్. అలాగే మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి శ్రీకాంత్, యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి. రవీందర్ రెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.