Vijay Antony : తమిళ్ హీరో విజయ్ ఆంటోని గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ సలీం, బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్. ఇక బిచ్చగాడు సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మారుతున్నారు. అలానే దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఇటీవల పిచ్చైకారన్ 2 చిత్రీకరణలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ మలేషియాలోని లంకావి అనే దీవిలో జరుగుతుంది. ఈ క్రమంలోనే జెట్ స్కై వాహనంలో వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే విజయ్ ప్రయాణిస్తున్న బోట్.. కెమెరాలు ఉన్న పడవను ఢీకొట్టింది. దీంతో విజయ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని.. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
అయితే విజయ్ పరిస్థితి విషమమంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించాయి సన్నిహిత వర్గాలు. విజయ్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. విజయ్ నడుముకు స్వల్ప గాయమైంది. దాన్నుంచి కోలుకుని తన సినిమా పనులు చేసుకుంటున్నారు. చిత్రీకరణ వాయిదా పడింది.. మీడియాలో వస్తున్నట్లు ఆయనకు పెద్ద ప్రమాదం జరగలేదు.. ఆరోగ్యంగా ఉన్నారని వారు వెల్లడించారు. అదే విధంగా బుధవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు అని వెల్లడించాయి.