Balagam director Venu Yeldandi: ఈ ఏడాది చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. తెలంగాణ సంస్కృతిలోని కాకి ముద్ద ముట్టింది అనే ఓ సంప్రదాయంపై కథను తయారు చేసి భావోద్వేగాల ప్రయాణంగా ‘బలగం’ సినిమాను తెరకెక్కించారు. చాలా రోజుల తర్వాత కుంటుంబం అంతా కలిసి చూసేలా వచ్చిన సినిమా అని ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు సైతం సినిమాను అభినందించారు. ఇక రాజకీయ నాయకులు కూడా సినిమా బావుందని అప్రిషియేట్ చేయటమే కాకుండా సెలబ్రిటీలందరూ ‘బలగం’ టీమ్‌ను ఆహ్వానించి సత్కారాలు చేశారు.
అప్పటి వరకు పలు చిత్రాల్లో కమెడియన్, జబర్దస్త్ కామెడీ షోస్‌తో మెప్పించిన వేణు ఎల్దండి ‘బలగం’ (Balagam movie) సినిమా తర్వాత అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా? అనేది అందరిలోనూ ఆసక్తిని రేపింది. బలగం సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై దిల్‌రాజు కుమార్తె హన్షిత, శిరీష్ కొడుకు హర్షిత్ ఈ సినిమాను నిర్మించారు. అదే బ్యానర్‌లో ఇప్పుడు దిల్ రాజు వేణుతో నెక్ట్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బలగం’ మూవీ రిలీజైన తర్వాతనే వేణు దిల్‌రాజు అండ్ టీమ్‌కు తన దగ్గరున్న మరో పాయింట్‌ను చెప్పారు. ఆయనకు నచ్చింది. పూర్తి కథను నెరేట్ చేయమని ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అది కూడా పూర్తయ్యింది. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. ఆ విషయాన్ని వేణు ఎల్దండి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన రెండో సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయని చెప్పారు.