‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మొదలైన సినిమాల్లో నటించినప్పటికీ విజయ్ దేవరకొండను తిరుగులేని హీరో స్థాయికి చేర్చింది ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోల ప్రపంచానికే ఒక ఐకాన్ లా మారిపోయారు. నిజానికి అంతకు ముందు ‘పెళ్లి చూపులు’ సినిమా సూపర్ హిట్టయినప్పటికీ ‘అర్జున్ రెడ్డి’ సాధించిన విజయం తిరుగులేనిదనే చెప్పాలి. ఆ తర్వాత హిట్లూ, ఫ్లాపులతో ఆయన కెరీర్ కొనసాగినా విజయ్ కి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలోని విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎంత డైనమిక్ గా వుంటుందో, ఆ తర్వాత ఆయన నటించిన ‘గీత గోవిందం’లో అంత బుద్ధిమంతుడైన ప్రేమికుడిగా కనిపించి ఆడియెన్స్ కి ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కలిగించారు. ‘మహానటి’ సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన క్యారెక్టర్ పూర్తి నిడివి లేకపోయినా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇక ఆయన కెరీర్ లో ‘ద్వారక’, ‘నోటా’, ‘ఏ మంత్రం వేసావే’ లాంటి నిరాశపరచిన సినిమాలున్నప్పటికీ విజయ్ దేవరకొండ అనగానే యూత్ ఆడియెన్స్ కి ఓ రఫ్ అండ్ టఫ్ రౌడీ గుర్తొస్తాడు.
ఇకపోతే, కారణాలేవేమైనప్పటికీ తొలిసారి జతకట్టి పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ మనకు అందించబోతున్న ‘లైగర్’ సినిమా రిలీజ్ చాలా లేటై ఆగస్టు 25వ తేదీన మన ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందోనన్న ఆసక్తి ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు ఇండస్ట్రీలోనూ నెలకొంది. అయితే, ‘లైగర్’ రిలీజ్ కి ముందే ఇటీవలే శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఖుషి’ పట్టాలెక్కేసింది.
ఇకపోతే, ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇటీవలే లోక నాయకుడు కమల హాసన్ కథానాయకుడిగా రూపొంది అందరినీ మెప్పించిన ‘విక్రమ్’ చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో విజయ్ మాట్టాడుతూ ‘విక్రమ్’ చిత్రాన్ని చూశాననీ, తనకు బాగా నచ్చిందనీ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆయన దర్శకత్వంలో నటించాలని వుందనీ, ఆయన నుంచి కాల్ కోసం ఎదురు చూస్తున్నాననీ అన్నారు విజయ్ దేవరకొండ. ఒకవేళ ఇదే గనక నిజమైతే మరో క్రేజీ కాంబినేషన్ కి తెర లేవబోతోందన్నమాటే…!!