Mallareddy : తెలంగాణ రాజకీయాల రోజురోజుకి మరింత వేడెక్కుతున్నాయి. ఇటీవల ముగుగోడు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఎంత చర్చకు దారి తీసిందో తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా తెలంగాణలో మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అలానే మల్లారెడ్డి కూతురు కొడుకు, అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో ఏకంగా 50 బృందాలు పాల్గొనడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలంగాణ లోని మరో మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లల్లో ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు తాజాగా మరో మంత్రి ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం కలకలం రేపుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
పన్ను ఎగవేతలు, ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలపై ఐటీ దాడుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొవడంలో భాగంగానే మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు టిఆర్‌ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్ గా మారుస్తూ జాతీయ రాజకీయాల్లోకి కేసిఆర్ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.