Entertainment ఎంతో మంది కమెడీయన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తమదైన శైలిలో నవిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారిలో కొంతమంది హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడా జాబితాలోకి ధనరాజ్ చేరనున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఆయన.. బుజ్జీ ఇలా రా చిత్రంతో హీరోగా మారబోతున్నారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే..
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల.. ధనరాజ్ గురించి మాట్లాడుతూ.. “నాకు ఇండస్ట్రీకి వచ్చాక పరిచయం అయిన మెుదటి ఫ్రెండ్ వీడు.. అలాగే అరేయ్, బావ అని పిలుచుకునే బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఇలా ఈ రోజు వాడి సినిమాకు వచ్చి ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ధన్ రాజ్ హీరో అనడం కంటే మంచి యాక్టర్ అనడంమే నాకు ఇష్టం. వాడు మరిన్ని సినిమాలు హీరోగా చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీలో మేం చాలా కష్ట పడ్డాం” అని చెప్పారు. ఆ మాటలు వినిన ధన్ రాజ్ స్టేజ్ మీదకు ఏడుస్తూ వచ్చి.. “సారీ సార్ క్షమించాలి.. ఇంత సేపూ నవ్వూతూనే ఉన్నా.. కానీ వీడి మాటలు విని ఎందుకో ఇలా ఏడుపు వచ్చింది” అంటూ భావోద్వేగంతో మాట్లాడారు.
కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా చాందిని తమిళసరన్ నటిస్తుండగా సునీల్, శ్రీకాంత్ అయ్యాంగార్, టెంపర్ వంశీ తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు.