సిరిసిల్ల రాజన్న జిల్లాలో జూన్ 4వ తేదీన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వినోద్ కుమార్ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ ద్వారా తీసిన ఫోటోలను జాగ్రత్తగా భద్రపరిచి వాటిని ప్రత్యేక మెసెంజర్ ద్వారా ముంబైకి పంపించి అక్కడి ఫిలిం స్టూడియో ఆర్టిస్టు ద్వారా ముస్లిం మైనారిటీ యువకుడు ఇస్తియాక్ అహ్మద్ ఆర్ట్ వేయించారు.
ఈ ఆర్ట్ ఫ్రేమ్ ను తన సహచర మిత్రులు అయినా సాజిద్ ఖాన్, షేక్ యూసుఫ్, మొహమ్మద్ సలీం ఖాన్, మీర్ షౌకత్ అలీ, సయ్యద్ మజీద్ లతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో వినోద్ కుమార్ కు బహూకరించారు.
ముస్లిం యువకులు అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజా, తీర్థ ప్రసాదాల దృశ్యాన్ని మొబైల్ లో తీసిన ఫోటోను ప్రత్యేకంగా ఆర్ట్ వేయించి తనకు బహుకరించడం పట్ల వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ముస్లిం మైనార్టీ యువకుల మత సామరస్యానికి, సెక్యులర్ స్ఫూర్తిని అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో ముందుకు సాగాలని, మతాలు, కులాలకు అతీతంగా ఒకరికి మరొకరు గౌరవించుకోవాలని, సెక్యులర్ స్ఫూర్తిని కొనసాగించాలని వినోద్ కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.