Kevvu Kartheek : మిమిక్రితో కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ తో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తీక్. ప్రస్తుతం కమెడియన్ గా పలు సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తున్నాడు. కెవ్వు కార్తీక్ చాలా మాములు ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి పైకి ఎదిగాడు. ఇటీవలే వివాహం కూడా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు కెవ్వు కార్తీక్ బిగ్‌బాస్ లోకి వెళ్తాడని టాక్ వినిపిస్తుంది.
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో రానుంది. ఇటీవలే ఓ రెండు ప్రోమోలు రిలీజ్ చేసి ఆడియన్స్ కి షోపై మరింత ఆసక్తి పెంచారు. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ చేయనున్నారు.
అధికారికంగా తెలియకపోయినా బిగ్‌బాస్ సీజన్ 7లో ఈ సారి పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్… అమరదీప్ – తేజస్విని జంట, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, ఓ యూట్యూబ్ మేల్ యాంకర్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి, ఓ సీరియల్ నటి, సురేఖ వాణి, సుప్రీతా.. ఇలా మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే షో మొదలయ్యేవరకు కూడా ఫైనల్ కంటెస్టెంట్స్ పేర్లు అధికారికంగా బయటకు రావు.
గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి కెవ్వు కార్తీక్ జబర్దస్త్ లో కనపడట్లేదు. అలాగే కెవ్వు కార్తీక్ కి బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చినట్టు, దానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే జబర్దస్త్ మానేశాడని సమాచారం.గతంలో కెవ్వు కార్తీక్ ఫ్రెండ్, అతనితో కలిసి స్కిట్స్ చేసి ముక్కు అవినాష్ కూడా జబర్దస్త్ నుంచి బిగ్‌బాస్ కి వెళ్లి వచ్చాడు. ప్రతి సంవత్సరం జబర్దస్త్ నుంచి ఒకరు లేదా ఇద్దరు బిగ్‌బాస్ కి వెళ్తారు. దీంతో ఈ సీజన్ లో కెవ్వు కార్తీక్ కి ఆ అఫర్ వచ్చినట్టు, రెమ్యునరేషన్ కూడా బాగానే ఇస్తుండటంతో కార్తీక్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బిగ్‌బాస్ షో సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలవుతుందని సమాచారం.