వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో నాగశౌర్య, షిర్లీ సెటియా వేదికపై ఏముందిరా పాటకు డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే షిర్లీ సెటియా తన పాటతో కూడా ఆకట్టుకున్నారు. చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు నాగవంశీ, సుధాకర్ చెరుకూరి, వివేక్ , దామోదర్ ప్రసాద్, హర్షిత్ రెడ్డి, దర్శకులు నందినీ రెడ్డి, బివిఎస్ రవి, మాజీ మంత్రి రఘువీర రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘కృష్ణ వ్రింద విహారి’ రెండున్నరేళ్ళ ప్రయాణం. కోవిడ్ కారణంగా చాలా సమస్యలు తలెత్తాయి. చాలా ఆర్ధిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ సినిమా నిర్మాతలైన మా అమ్మనాన్న.. నా కోసం, సినిమా యూనిట్ కోసం చాలా ధైర్యంగా నిలబడి మంచి డేట్ కోసం ఎదురుచూసి సినిమాని ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి అమ్మనాన్న దొరకడం నా అదృష్టం. దర్శకుడు అనీష్ కృష్ణ మంచి మనసున్న దర్శకుడు. ఆయనతో చేసిన ప్రయాణంలో నేను చాలా మారాను. ఆయన జుట్టులానే ఆయన ఓపిక పెరుగుతూనే వుంటుంది. చాలా మంచి కథ చెప్పారు. అద్భుతంగా తీశారు. నాకు మంచి సినిమా ఇవ్వబోతున్నారనే నమ్మకం వుంది.
కెమరామెన్ సాయి శ్రీరామ్ గారు నాకు చాలా ఇష్టం. ఆయనతో ఇదివరకు సినిమాలు చేశాను. ఈ సినిమాకి ఆయన పని చేయడం నా అదృష్టం. చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం వుంది. సినిమా లైఫ్ ని నిర్ణయించే సన్నివేశం అది. ఆ ఒక్క సీన్ లక్ష్మీ భూపాల గారు అద్భుతంగా రాశారు. ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మహతి సాగర్ సంగీత దర్శకుడు అనడం కంటే నా బెస్ట్ ఫ్రండ్ అనడం సబబు. ఇండస్ట్రీలో నా గురించి మొత్తం తెలిసిన వ్యక్తి సాగర్. నేను ఎలాంటి మూడ్ లో వున్న తనకి తెలిసిపోతుంటుంది. ఇందులో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ గారు పాటలని చాలా బ్యూటీఫుల్ గా కోరియోగ్రఫీ చేశారు. కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించారు. శెర్లీ చాలా మంచి నటి. అందంగా పాడుతుంది కూడా. తనతో నటించడం ఆనందంగా వుంది.
రాధిక గారు లేకపోతే ఈ సినిమా చేసేవాడిని కాదు. ఈ సంగతి రాధిక గారికి కూడా చెప్పాను. ఆ పాత్ర రాధిక గారు కాకుండా ఎవరూ చేయలేరు. మా సినిమా చేసినందుకు రాధిక గారికి కృతజ్ఞతలు. అలాగే బ్రహ్మజీ గారు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు.. వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ.. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు. అనిల్ రావిపూడి అన్న క్లాప్ కొట్టినపుడు వచ్చారు. టీజర్ లాంచ్ కి వచ్చారు. ఇప్పుడు వచ్చారు. మాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ఆనందంగా వుంది. ఆయన మేలు మర్చిపోలేను.
ఈ సినిమా కోసం పాదయాత్ర చేశాను. అన్ని ఊర్లు తిరిగాను. కంటెంట్ బావుంది కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి నిలబడ్డాను. ఈ సినిమా చాలా బావుందని నిజాయితీగా నమ్ముతున్నాను. ఈ సినిమా చూడండి. హిట్టా, సూపర్ హిట్టా , బ్లాక్ బస్టరా, లేదా ఫ్లాప్ .. ఫలితం ఏదైనా శిరస్సు వంచి తీసుకుంటాను. సినిమా చాలా బావుందని మరోసారి చెబుతున్నాను. మీ నమ్మకం మాత్రం పోగొట్టుకోను. సెప్టెంబర్ 23న అందరూ థియేటర్ లో సినిమా చూసి ఆనందించాలి’’ అని కోరారు.