KTR : తెలంగాణలో ఊహించని రాజకీయ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. మునుగోడు బైపోల్ క్యాంపెయిన్ క్లైమాక్స్‌కు చేరింది. ఓవైపు ప్రచారం, మరో వైపు ప్రధాన పార్టీల పరస్పర ఆరోపణలతో రాజకీయం రోజురోజుకూ మరింత వేడెక్కుతుంది. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కీలక విషయాలను కేటిఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాక్యాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మూడేళ్లుగా తీవ్రంగా ప్రయత్నించారు. మా పార్టీ నేతలతోనే కాదు, స్వయంగా నాతో కూడా మాట్లాడారు అని కేటిఆర్ అన్నారు. ఆయన చేరిక విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా… వారిని పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించారు. కోమటిరెడ్డి సోదరులకు నిలకడ ఉండదు, మాట మీద నిలబడే నేతలు కాదు. గతంలో వైఎస్సార్‌ను, జగన్‌ను మోసం చేశారని తెలిపారు.
అందుకే వారిని మనం నమ్మలేం అని కేసీఆర్ చెప్పారని… అందుకే వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదని కేటీఆర్ వెల్లడించారు. 2019 లో మునుగోడులో జరిగిన ఓ కార్యక్రమంలో తాను బాగా పనిచేస్తున్నానని… అందుకే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని పొగిడిన విషయం కేటీఆర్ గుర్తుచేశారు. రాజగోపాల్ రెడ్డి కేవలం కాసుల కోసమే ఈ పని చేస్తున్నారని ఆరోపించారు. అలానే సొంత నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. చూడాలి మరి ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుందో అని.