Lalu Prasad Yadav : ఆర్జేడీ అధినేత లాలా ప్రసాద్ యాదవ్ కుమార్తె పెద్ద మనసు చాటుకుంది. తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడింది. గత కొంతకాలంగా లాలా ప్రసాద్ యాదవ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాగా ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో ఉంటున్న లాలూ రెండో కుమార్తె రోహిణి తన తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చారు.
తన తండ్రికి కిడ్నీ మార్పిడి చేస్తే మెరుగైన జీవితం గడిపి, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ మేరకు ఇటీవలే లాలూ ప్రసాద్ ను ఆమెతో పాటు సింగపూర్ తీసుకెళ్ళారు. అక్కడ ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి… తన తండ్రికి కిడ్నీ ఇస్తే ఆయన కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆమె తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం అందుతుంది.
అయితే ఈ నిర్ణయాన్ని లాలూ మొదట వ్యతిరేకించారు. తన కూతురు కిడ్నీ తీసుకోవడానికి అంగీకరించలేదు. కానీ వైద్యుల సూచన మేరకు చివరకు ఆయన అంగీకరించారని వారి సన్నిహితులు వెల్లడించారు. రక్త సంబంధీకులు చేసే అవయవదానం మరింత సత్ఫలితాన్నిస్తుందని నమ్మడం వల్ల కూడా లాలూ దీనికి అంగీకరించినట్లు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే లాలూ సింగపూర్ వెళ్లబోతున్నారు. అక్కడే ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. ఈ నెల 20-24 మధ్యలో ఈ శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి రక్త సంబంధీకులు ఎవరైనా కిడ్నీ దానం చేయొచ్చనే సంగతి తెలిసిందే.