ఒక సినిమాని రూపొందించే సిబ్బంది ఆ సినిమా సూపర్ హిట్టవ్వాలనే కోరుకుంటుంది గానీ, ఫ్లాప్ అవ్వాలని కోరుకోదు. ముఖ్యంగా దర్శక నిర్మాతలు, హీరోపై ఈ బాధ్యత ఎక్కువగా వుంటుంది. అయితే, కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో సినిమాలు బాక్సాఫీసువద్ద బోల్తా కొడతాయి. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఫ్లాపులకు ఎవరు బాధ్యత వహిస్తారనే అంశంకన్నా ఎవరు దెబ్బ తింటారనేదే ముఖ్యమైన అంశం.
కాగా, తొలిసారి దర్శకుడు పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల కాంబినేషన్ లో రూపొంది అనూహ్యమైన పరాజయాన్ని చవిచూసింది ‘లైగర్’. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాధ్ తన కుటుంబానికి ‘లైగర్’ కొనుగోలుదారులు, పంపిణీదారుల నుండి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ కొందరిని ప్రేరేపించారనీ, తనకు పోలీసు రక్షణ కల్పించాలనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇటీవల, సోషల్ మీడియాలో లీక్ అయిన ఆడియో క్లిప్‌లో దర్శకుడు, ‘లైగర్’ కొనుగోలుదారులు, పంపిణీదారులు తమకు డబ్బు తిరిగి ఇవ్వకపోతే తన ఇంటి ముందు నిరసన చేపడతామని బెదిరిస్తున్నారన్నారు పూరీ. సినిమా ఫ్లాప్ నష్టాన్ని కొంతమేర భర్తీ చేస్తానని హామీ ఇచ్చినా, తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని వివరించారు ఆయన. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏదేమైనా, పైకి సరదాగా, వినోదంగా కనిపించే సినిమా ఫ్లాపైతే కొన్ని జీవితాల్లో పెను ప్రకంపనలను సృష్టించగలదనేది కఠోర వాస్తవం.