సినిమా… జీవితం… రెండు పదాల్లోనూ మూడక్షరాలున్నాయి. రెండింటిలోనూ బాధ, సంతోషం, ఉత్తేజం అనే మూడు లక్షణాలున్నాయి. రెండింటిలోనూ మూడు కాలాలకు సరిపడా కథలుంటాయి. అందుకే, సినిమాకి జీవితం, జీవితానికి సినిమా ప్రతిబింబంగా మారాయి. ప్రేక్షకులు తమ చేతికందని, వెండితెరపై ఆవిష్కృతమైన ఊహా లోకాన్ని చూసి ఆస్వాదించి మురిసిపోతారు. సినిమా సమాజంలోని కథల్ని తనలో నింపుకుని రంగులకలాగా మెరిసిపోతూంటుంది. సగటు మనిషి నిత్య జీవితంలో భాగమై, నాలుగు ఆటలతో ఎందరికో మూడు పూటలా ఉపాధిగా మారిన సినిమాకు పునాదులు వేసిన మహనీయులు ఎందరో… వారందరికీ నిత్యం హృదయపూర్వక వందనాలను సమర్పించుకోవలసిందే…!! సినిమా పుట్టుక, మనిషి పుట్టుక… సినిమా ఎదుగుదల, మనిషి ఎదుగుదల ఒకేలా సాగాయి. మనిషి పుట్టిన తరువాత కొంత కాలానికి తప్పటడుగులు వేస్తాడు. సినిమా కూడా పరదా మీద పురుడు పోసుకుని దినదినాభివృద్ధి చెందింది. అప్పుడే పుట్టిన శిశువుకు మాటలు రావు. సినిమా కూడా ముందు మూకీగా కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత శిశువులాగే మాటలు నేర్చి టాకీ అయింది. సినిమా అనేది ఆంగ్ల పదం. దీని అర్థం కదలిక. ఇది అనేక ఐరోపా భాషల్లోనూ వుంది. తొలి రోజుల్లో సుమారు 30 ఏళ్ల పాటు మూకీ సినిమాలే రాజ్యమేలాయి. అయితే, 1923లోనే అక్కడి జనం డబ్బులిచ్చి టాకీ సినిమాలను చూసేవారు. మనదేశంలో తొలి టాకీ చిత్రం 1931లో రూపు దిద్దుకుంది. ఒకే సంవత్సరంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడు టాకీ చిత్రాలు రూపు దిద్దుకున్నాయి. దీని గురించి మాట్టాడుకునే ముందు మరో విశేషం గురించి మాట్టాడుకోవాలి. ఇప్పటివారికి కూడా ఎల్.వి.ప్రసాద్ అంటే తెలిసి వుండవచ్చు గానీ, ఆయన పూర్తి పేరు అక్కినేని లక్ష్మీవర ప్రసాద్ అని చాలా మందికి తెలిసి వుండకపోవచ్చు. నటుడిగా, దర్శకుడిగా తొలి తరంలోనే ఆయన వెలిగిపోయారు. దర్శకుడిగా మిస్సమ్మ, గృహ ప్రవేశం, పల్నాటి యుద్ధం, ద్రోహి, మన దేశం, సంసారం, షావుకారు మొదలైన సూపర్ హిట్ ఆణిముత్యాలను అందించిన ఎల్.వి.ప్రసాద్, భవిష్యత్తులో ఎవరూ సాధించలేని ఒక రికార్డును సాధించారు. అదేంటో తెలుసా? 1931లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఏకైన నటుడిగా రికార్డు సాధించారు. తెలుగు టాకీ చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’లోనూ, తొలి తమిళ టాకీ ‘కాళిదాస్’లోనూ, తొలి హిందీ టాకీ ‘ఆలం ఆరా’లోనూ నటించి అరుదైన రికార్డును సాధించిన మహనీయుడు ఎల్.వి.ప్రసాద్ ని ఎప్పటికీ మరువలేం…!