Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ అకాల మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగు ప్రేక్షకులంతా విషాదంలో మునిగిపోయారు. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియపరిచారు. దీంతో ఒకే ఏడాదిలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను కోలుపోవడం మహేష్ కి తీరని లోటు అనే చెప్పాలి. ఈ ఏడాది జనవరి 9న మహేష్ అన్న కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆసమయంలో మహేష్ కరోనాతో బాధపడుతున్నారు. ఇక ఆ కారణంతో అన్నను కడసారి చూడలేక పోయారు మహేష్. ఇక సెప్టెంబర్ 28న మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇక ఇప్పుడు కృష్ణ మరణం మహేష్ బాబును మరింత విషాదం లోకి నెట్టింది.
కాగా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేయడానికి విజయవాడ చేరుకున్నాడు. కృష్ణా ప్రవాహ ప్రాంతమైన బుర్రెపాలెంలో జన్మించడంతో అయన అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమం లోనే ఈరోజు ఉదయం మహేష్ బాబు మరియు కుటుంబసభ్యులు స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో విజయవాడ చేరుకొని హిందూ శాస్త్రీయ సంప్రదాయాలతో కృష్ణ అస్థికలను నిమజ్జనం చేశారు.
మహేష్ ఫ్యామిలీతో పాటు మహేష్ బాబు వెంట ఆయన బావలు సంజయ్ స్వరూప్, జయదేవ్, సుధీర్ బాబు, చిన్నాన్న ఆదిశేషగిరిరావు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు మహేష్ వెంట ఉన్నారు.