Mass Maharaj Raviteja : మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. కంప్లీట్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దుమ్ములేపింది. అదే ఊపును కొనసాగిస్తూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా మంచి మాస్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు రవితేజ. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శృతి హాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ఇక మెగాస్టార్ సరసన కూడా తమ్ముడి పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు. రవితేజ యాక్టింగ్ కి ప్రేక్షకులంతా ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్నాడు రవితేజ. అయితే ఇప్పుడు తన అభిమానులకు మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు మాస్ మహారాజ్.
జనవరి 26న రవితేజ పుట్టినరోజు కానుకగా ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించగా, రమేష్ పుప్పల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా.. రవితేజ ఊరమాస్ అవతార్ లో దుమ్ములేపాడు. మరి మిరపకాయ్ మూవీ రీ-రిలీజ్‌తో ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.