పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా తెలంగాణ సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. పట్టణాభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పట్టణాభివృద్ధిలో తమ చిత్తశుద్ధికి ఈ ఏడాది వివిధ పురపాలక సంఘాలు సాధించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులే నిదర్శనమని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్- 2021 అవార్డులు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు, ఉన్నతాధికారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆదివారం ఈ అవార్డులు అందుకున్న పురపాలికల అధికారులు, నేతలతో ఢిల్లీలో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల సర్వతోముఖాభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు ఇస్తున్నామని చెప్పారు. పట్టణప్రగతి వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నగరాలను స్వచ్ఛంగా, సుందరంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.
జాతీయస్థాయిలో జయకేతనం
——————–
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలు, పథకాలతో పట్టణాల్లో గుణాత్మక మార్పులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. పట్టణ పాలన విషయంలో పీఎం స్వనిధి వంటి కార్యక్రమాల్లోనూ జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తున్నామని గుర్తుచేశారు. సఫాయి మిత్ర పథకంలో దేశంలో రెండోస్థానంతోపాటు 11 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావటం తెలంగాణకు గర్వకారణమన్నారు.
పురపాలకశాఖ సిబ్బంది, పురపాలికల ప్రజాప్రతినిధుల నిబద్ధత, కృషితోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. అవార్డులు సాధించిన పురపాలక సంఘాలను స్ఫూర్తిగా తీసుకొని ఇతర పట్టణాలు చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ స్వయంగా కలిసి అభినందించడం పట్ల పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. కేటీఆర్ నాయకత్వంలో పట్టణాలను మరింతవేగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.