కేవలం పద్దెనిమిదేళ్ల అతిపిన్న వయసులోనే చదువు ఆపేసి సంగీత రంగంలోకి దిగిన మణిశర్మ అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. అనేకమందికి గురువైన జాకబ్ జాన్ వద్ద పాశ్చాత్య సంగీతాన్ని నేర్చుకున్న ఆయన, ఆ తర్వాత కర్ణాటక సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. విభిన్నమైన సంగీతాన్నందించడంలో దిట్టగా పేరొందిన మణిశర్మ ఇప్పటి వరకూ సుమారు 200 చిత్రాలకు పైబడి సంగీతాన్నందించారు.
అయితే, నాటి సంగీత దిగ్గజం సాలూరి రాజేశ్వర రావు నుండీ, వందేమాతరం శ్రీనివాస్ వరకూ అనేకమంది వద్ద పనిచేసిన అనుభవం ఆయనను సంగీతంలో నిష్ణాతుడిగా తీర్చిదిద్దిందనే చెప్పాలి. సౌమ్యమైన సంగీతం, స్పష్టంగా వినిపించే సాహిత్యం ఆయన సమకూర్చే పాటల్లో ఆకట్టుకునే అంశాలు. వయొలిన్ కళాకారుడైన యనమండ్ర నాగయజ్ఞ శర్మగారి కుమారుడైన మణిశర్మ, నాలుగేళ్ల కిందటే తండ్రిని పోగొట్టుకున్నారు. తాజాగా మణిశర్మ మాతృమూర్తి 88 ఏళ్ళ యనమండ్ర సరస్వతి అనారోగ్యంతో కన్ను మూశారు. బాల్యం నుండీ సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోనించేదుకు ఎంతగానో ప్రోత్సహించిన తన మాతృమూర్తి సరస్వతి ఎంత ప్రయత్నించినప్పటికీ దక్కకపోవడంవల్ల మణిశర్మ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.