Crime News : ఢిల్లీలోని మెహ్రౌలీ హత్య కేసులో మరో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తాను సహజీవం చేస్తోన్న శ్రద్ధ అనే యువతిని దారుణంగా హత్య చేయడానికి అమెరికన్ క్రైమ్ షో ‘డెక్స్టర్’ నుండి ప్రేరణ పొందాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడు గూగుల్ సెర్చ్ హిస్టరీ పరిశీలిస్తే… హత్య చేసిన తర్వాత రక్తాన్ని శుభ్రపరిచే పద్ధతిని వెతికి, హ్యూమన్ అనాటమీ గురించి పూర్తి సేకరించినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు.
అఫ్తాబ్ అమీన్ తన భాగస్వామి శ్రద్ధ ను హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 భాగాలుగా నరికాడు. అయితే ఇలా చేయడానికి ముందు ‘డెక్స్టర్’ క్రైమ్ షో తో పాటు అనేక ఇతర క్రైమ్ సిరీస్‌లను కూడా పరిశీలించాడని ఏఎన్‌ఐ ఓ నివేదికలో ప్రకటించింది. ఇక తాను శరీరాన్ని ముక్కలుగా చేయడం కోసం మానవ శరీర నిర్మాణ శాస్త్రం గురించి చదివానని.. దీని సహాయంతో తాను శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. అఫ్తాబ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
28 ఏళ్ల శ్రద్ధ ఆరు నెలల క్రితం హత్య చేయబడింది. ఆమె మృతదేహం ముక్కలు దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో నిందితుడు 18 రోజుల పాటు విసిరివేశాడు. శ్రద్ధ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఈ దారుణ హత్య కేసును ఛేదించారు. అఫ్తాబ్ కు 5 రోజుల పోలీసు రిమాండ్‌కు పంపారు. కాగా ఐదు నెలల క్రితం మే 18న పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో శ్రద్ధను గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు చెప్పారు.