Oil Palm is Good in Telangana State, Assistant Minister of Agriculture Shobha Karandlaje, CM KCR, BRK Bhavan, Minister Niranjana Reddy, Telangana Poltical News, Telugu World Now,
Telangana News: ఆయిల్‌పామ్‌పై తెలంగాణ ప్లాన్ భేష్, 100% సబ్సిడీని పరిశీలిస్తాం: కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లజే
ఆయిల్‌పామ్ పంట సాగుపై తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక ఎంతో బాగున్నదని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభ కరంద్లజే అన్నారు. ఈ పంట సాగులో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తున్నదని ప్రశంసించారు. ఆయిల్‌పామ్ సాగుకు వందశాతం సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె, బీఆర్కే భవన్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజలతోటు పప్పుగింజల సాగుకు కేంద్రం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉత్పత్తులకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎగుమతులు పెంచేందుకు వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల అధికారులతో బృందాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. అనంతరం జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని మంత్రి శోభ సందర్శించారు. మిద్దె తోటల పెంపకాన్ని పరిశీలించి 15 మంది రైతులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
రైతుబంధుపై ఆసక్తి
—————–
రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంపై కేంద్ర మంత్రి ప్రత్యేక ఆసక్తి చూపారు. పథకం వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఏటా రెండు సీజన్లలో ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు కింద పెట్టబడి సాయం అందజేస్తున్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు వివరించారు. ఏడు విడతల్లో రూ.43,037 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ప్రస్తుత వానకాలంలో 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,360.41 కోట్లు జమచేసినట్టు చెప్పారు. రైతుబీమా కింద 2018 నుంచి ఇప్పటివరకు 60,340 రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున రూ.3,017 కోట్లు చెల్లించినట్టు సీఎస్ తెలిపారు.
దొడ్డు వడ్లు కొనండి: మంత్రి నిరంజన్‌రెడ్డి
————————————
తెలంగాణ రైతులు పండించే దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. దొడ్డు వడ్లు కొనకూడదన్న ఎఫ్‌సీఐ నిర్ణయంతో రైతాంగం ఆందోళనలో ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రైతులను వరి సాగు నుంచి నూనె, పప్పుగింజలు, ఆయిల్‌పామ్ వంటి పంటలవైపు మళ్లించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని నిర్ణయించామని, ఈ పంటకు వందశాతం రాయితీ ఇవ్వాలని కోరారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.55-60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు. సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి శోమిత బిశ్వాస్, రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి హన్మంతు కొండిబ, వ్యవసాయ వర్సిటీల వీసీలు ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్, టీఎస్‌కాబ్ ఎండీ మురళీధర్, మేనేజ్ డీజీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర నిధులు పదిరెట్లు పెంచండి
—————————-
రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేంద్రం ఇచ్చే నిధులను పదిరేట్లు పెంచాలని కేంద్ర మంత్రికి నిరంజన్‌రెడ్డి వినతిపత్రం అందించారు. ఈ రంగాలకు ప్రస్తుతం ఏటా సగటున రూ.800 కోట్లు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలకు ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్రం నిధులు పెంచాలని విజ్ఞప్తిచేశారు. దేశ భూ విస్తీర్ణంలో తెలంగాణ వాటా 3.4 శాతమే ఉన్నప్పటికీ, దేశం మొత్తం పంటలసాగు విస్తీర్ణంలో 4.65 శాతం, ఉత్పత్తిలో 9.9శాతం ఉన్నదని లేఖలో వివరించారు.