సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ని శంషాబాద్ జోన్ లోని పలు చెరువులను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీ టి శ్రీనివాస్ రావు, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ లలో కలిసి గణేష్ నిమజ్జన తీరు తెన్నులను పరిశీలించారు.
ముఖ్యంగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్తి కుంట చెరువు, మల్లారెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని పల్లె చెరువు, RGIA పోలీస్ స్టేషన్ పరిధిలోని కాముని చెరువును సిపి విజిట్ చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణపతి నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, నీటిని పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నామన్నారు.
జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, శానిటేషన్,మెడికల్ అండ్ హెల్త్ తదితర డిపార్ట్మెంట్ తో కలిసి సమన్వయంగా పూర్తి సన్నద్ధతతో ఉన్నామన్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.
భద్రత ఏర్పాట్లలో లాండ్ ఆర్డర్ తో పాటు వివిధ శాఖల అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారన్నారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.
వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వలంటీర్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. నిమజ్జనానికి వచ్చే వారితో సిబ్బంది, పోలీసులు మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా గుంతులుగా ఉన్నరోడ్లను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని గణేశ్ నిమజ్జన చెరువు కట్టల వద్ద విద్యుత్ లైట్లను, భారీ కేడ్లను నిర్మించాలని భక్తుల సౌకర్యార్థం మంచి నీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు, రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులు పూర్తి చేశారన్నారు.
నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ మళ్ళింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. వర్షాల కారణంగా గణేశ్ నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విజిబుల్ పోలిసింగ్ తో పాటు సీసీటీవీలపై దృష్టి సారించామన్నారు.
ప్రతీఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు.