Pm Narendra Modi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఎప్పటినుంచో కోరుతున్న విషయం త్వరలోనే నిజం కానుంది. ఎన్నో సంవత్సరాల నుంచి విశాఖను రైల్వే జోన్ గా ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలంతా కోరుతున్నారు. ఈ తరుణంలోనే వారి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి రైల్వేజోన్ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం ఈ వర్తతో దక్షిణ కోస్తా ప్రాంత ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మొదటగా నవంబర్ 11న విశాఖ చేరుకోనున్న పీఎం మోదీకి సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుంటారు. కొద్ది సమయం ఈఎన్సీ అధికారులతో రక్షణ రంగంపై చర్చించి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత 12వ తేదీ ఉదయం ఏయూ గ్రౌండ్స్‌కి చేరుకొని బహిరంగ సభకు హాజరవుతారు. ఈ వేదిక నుంచే పలు కీలక కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.
వాటిలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.120 కోట్ల వ్యయంతో జోన్ ప్రధాన కార్యాలయం నిర్మిస్తారు. విశాఖ శివారు వడ్లపూడిలో రైల్వే అనుబంధ సంస్థ ఆర్వీఎన్ఎల్ రూ.260 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యాగన్ వర్క్‌షాప్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) నేతృత్వంలో రూ.446 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. గంభీరంలో రూ.445 కోట్లతో మొదటి విడతలో నిర్మించిన ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. అదే విధంగా రూ.380 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం జగన్ , ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు రైల్వే, ఇతర కేంద్ర సంస్థలకు సంబంధించిన పలు పనులను ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు.