పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (అక్టోబర్ 21, 2021) సందర్భంగా అమరవీరుల సేవలను స్మరిస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ… పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతీఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశ భద్రత చూసుకునే బాధ్యత సైనికులదైతే, దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే బాధ్యత పోలీసులదేనన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో పోలీసులు విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారన్నారు.
ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని ప్రతి పోలీస్ విధుల్లో చేరినప్పుడు ప్రమాణం చేస్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే విధులు నిర్వర్తించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన వారున్నారన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు.
కొత్తగా పోలీసు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్., బాలానగర్ డీసీపీ పద్మజా, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, ఎస్ఓటి డీసీపీ సందీప్, మాదాపూర్ డీసీపీ వేంకటేశ్వర్లు, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ-I కవిత, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ లావణ్య ఎన్జేపీ, ఏడీసీపీ రవి కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్ ఉల్ హక్, ఏసీపీలు, హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది, సీపీ ఆఫీసులోని సెక్షన్ల సిబ్బంది, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.