నరేంద్ర మోదీ ప్రధానిగా పనిచేయటం లేదని, తన షావుకారు దోస్త్‌కు సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్ తరఫున శనివారం జలవిహార్‌లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
వందేండ్లకు సరిపడే బొగ్గు వందేండ్లకు సరిపడే బొగ్గు గనులు మన దేశంలో ఉన్నాయి. ఏటా 5 వేల నుంచి 10వేల మిలియన్ టన్నుల బొగ్గు తీయవచ్చని సర్వేలు చెప్తున్నాయి. అయినా విదేశాల నుంచి బొగ్గును ఎందుకు దిగుమతి చేసుకొంటున్నారు? ఇందులో ఉన్న అసలు విషయం ఏమిటో రేపు మీ ప్రసంగంలో చెప్పండి. యావత్తు దేశం తెలుసుకుంటుంది. కానీ, మీరు మీ వ్యాపారులకు సాయం చేయటంలో బిజీగా ఉన్నారు. 10% విదేశీ బొగ్గు వాడండి.. లేదంటే కోల్ ఇండియా నుంచి మీకు బొగ్గు ఆపేస్తామని రాష్ర్టాలకు హుకుం జారీ చేస్తున్నారు. ఏంది మీ దాదాగిరి? ఇది ప్రజాస్వామ్య మర్యాదనా? బొగ్గు దిగుమతి విషయంలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా సరే.. మీ ఇష్టం ఉన్నది చేసుకోండి అని మేం తిరస్కరించాం.
యశ్వంత్‌గారు.. నేను ఈ విషయాన్ని మీకు చెప్పదల్చుకున్నాను. మాకు ఒక చరిత్ర ఉన్నది. కోల్ ఇండియాకు కాకుండా బొగ్గు గనులు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. మా దగ్గర సింగరేణి కాలరీస్ ఉన్నప్పుడు మేం విదేశీ బొగ్గు ఎందుకు కొనాలి? భారతదేశంలో రూ.4 వేలకు ఒక టన్ను బొగ్గు దొరుకుతుంది. మోదీ చెప్తున్న బొగ్గు టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. నాలుగైదు రెట్లు ఎక్కువ ధర పెట్టి కొనాలంట! ఎందుకంటే మోదీకి ఒక షావుకారు దోస్త్ ఉన్నడు. అతడే ఈ బొగ్గును విదేశాల నుంచి మనకు దిగుమతి చేసేది. అందుకే మోదీకి ఒక టైటిల్ ఇస్తున్నా. ఆయన ప్రధానిగా పనిచేయడం లేదు. ఆయన తన షావుకారు దోస్త్‌కు సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మోదీతో నాకు వ్యక్తిగత వైరం ఏమీ లేదు. మీ బొగ్గు దిగుమతి పాలసీ కారణంగానే మేం మిమ్మల్ని (మోదీని) దోషి అంటున్నాం. కాదంటే రేపు మీ ప్రసంగంలో చెప్పండి. దేశ ప్రజల తరఫున మేం ఈ రోజు లేవనెత్తిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని, వివరణ ఇవ్వాలని కోరుతున్నాం.
వికాస్ కాదు.. సత్యనాశ్
మేకిన్ ఇండియాతో కొత్త ఉద్యోగాలు రాలేదు. ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి వచ్చింది. ఫియట్, ఫోర్డ్, జనరల్ మోటర్స్, డాట్సన్, యునైటెడ్ మోటర్స్, హార్లీ డేవిడ్‌సన్ కంపెనీలు వెళ్లిపోయాయి. ఇదేనా మేకిన్ ఇండియా ఫలితం? ఈ తరహా విధానాలతో దేశ అభివృద్ధి సాధ్యమా? వికాస్ కాదు.. సత్యనాశ్ అవుతున్నది. మనది ఇంత విశాలమైన దేశం. జనాభా 140 కోట్లకు పైగా పెరుగుతున్నది. ఇన్ని కోట్ల మంది విషయంలో మీరు మజాక్ చేస్తున్నారు. ఇది దేశ హితానికి మంచిది కాదు. పూర్తిగా తప్పు.
సిగ్గు.. సిగ్గు
మీరు (మోదీ) ఒక్క మాటైనా నిలబెట్టుకొన్నారా? నల్లధనం వాపస్ తెస్తామని చెప్పారు. మరి వచ్చిం దా? వెనక్కి వస్తే ఎక్కడ ఉన్నదో చెప్పండి. ఎంత నల్లధనం వాపస్ తెప్పించారో మేం తెలుసుకోవాలనుకొంటున్నాం. దేశంలో నల్లధనం రెట్టింపు అయ్యిందని సర్కారీ లెక్కలే చెప్తున్నాయి. స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం రావడం కాదు.. మోదీ పాలనలో రెట్టింపు అయ్యింది. ఇవి అధికారిక గణాంకాలు. యావత్తు ప్రపంచం, దేశానికి తెలుసు. ఇదా వికాసం అంటే? కనీసం ఒక్కటంటే ఒక్కటైనా వాగ్దా నం పూర్తి చేయలేదు. ‘సోదరసోదరీమణులారా.. 2022 నాటికి దేశంలో సొంత ఇల్లు లేని కుటుంబం అన్నదే ఉండబోదు’ అని మోదీ గొప్పలు చెప్పారు. చేశారా? మనం 2022లోకి వచ్చేశాం. విచిత్రం ఏమిటంటే మోదీ ఇంకా 2022లోకి రాలేదేమో?
లక్షల కోట్ల కుంభకోణాలు
‘భ్రష్టాచార్ ముక్త్ భారత్.. నా ఖావూంగా.. నా ఖానేదూంగా’ అని ప్రధాని మోదీ గొప్ప నినాదం. కానీ, మీరు ఎంత తింటున్నారు? మీ షావుకారులకు ఎంత తినిపిస్తున్నారు? కుంభకోణాలు లక్షల కోట్లలోకి చేరుతున్నాయి. ఈ విషయాలన్నీ మేం సరైన సమయంలో దేశ ప్రజల ముందు ఉంచుతాం. ఏయే దేశాల్లో మీరు ఏయే వ్యాపారులకు సేల్స్‌మెన్‌గా మారి పనిచేశారో, వాటి వెనుక ఎంత పెద్ద కుంభకోణాలు ఉన్నాయో దేశం తెలుసుకొన్నది. ఇంకా మీరు ఎంత మందిని ఆపగలరు? ఎందరిని బెదిరించగలరు? దేశంలో బ్యాంకుల లూటీలు పెరిగాయి. మోదీ ప్రధాని కాకముందు నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ (ఎన్‌పీఏ) రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు ఉండేవి. ఇప్పుడు రూ.20 లక్షల కోట్లు. ఇదేనా అభివృద్ధి? ఈ లెక్కలను కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చినవే. ప్రస్తుతం భారతదేశంలో రేట్ ఆఫ్ ఎన్‌పీఏ దాదాపు రూ.18.6 లక్షల కోట్లు అని స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చెప్పారు. ఇదేనా మీ అభివృద్ధి కామిక? మీ డైనమిక్ ప్రభుత్వం సాధించిన ఫలితం ఇదేనా?