తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిఎఫ్‌జేఏ).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. సంఘ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా కాపు కాస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి మూడు లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీలను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. ఈ యేడాది (2023 మార్చి 2024 మార్చి) వరకూ సభ్యుత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేనిగారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గారు, షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారితో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ గారు హాజరయ్యారు.
ముఖ్య అతిథి రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం. ఒక యూనియన్ అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తే సంతోషంగా ఉంది. మామూలుగా మా సినిమాలకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా మీరంతా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బావుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్యూ. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఇకపై కలుస్తూనే ఉంటా.. ” అన్నారు.