‘సానపట్టు పట్టకుంటే వజ్రమైన అదొట్టి రాయిరా…’ అన్నారు ‘అశ్వని’ చిత్రంలో గీత రచయిత. ఇది అక్షర సత్యం. వజ్రమైనా అది భూగర్భంలో వుండిపోతే రాయితోనే సమానం. అయితే, వజ్రాన్ని వెలికి తీసి దాన్ని వజ్రంగా పరిచయం చేస్తాడు మనిషి. కానీ, మనిషిని వజ్రంగా ఎవరు ప్రపంచానికి పరిచయం చేయాలి? ముందు తనకు తానే పూనుకోవాలి. తనలో దాగి వున్న శక్తిని గుర్తించాలి. ఆ శక్తికి మెరుగు పెట్టాలి. అప్పుడు ఇతరుల సాయంతో తను ప్రపంచానికి వజ్రంగా పరిచయమవుతాడు.
నిజానికి ప్రతి మనిషీ ఒక వజ్రమే. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక శక్తి దాగి వుంటుంది. కానీ, దాన్ని గుర్తించకపోతే అది అంతర్గతంగా వుండిపోతుంది. ప్రతివారిలోనూ ఏదో ఒక కళ, ఏదో ఒక విద్య దాగి వుంటుంది. కావలసిందల్లా దానిపట్ల వారికి వుండాల్సింది అమితమైన ఆసక్తి. ఆ ఆసక్తి వారిలో నిద్రాణంగా వున్న శక్తిని మేల్కొలపడానికో చేయూత కావాలి. ముందు అమితమైన ఆసక్తి ముందడుగు వేయిస్తే చేయూత ఖచ్చితంగా దొరుకుతుంది.
అలాంటి చేయూతనందుకునే హీరో రవితేజ ఈరోజు మాస్ మహారాజాగా అవతరించారు. ఆయన నటించిన ‘ఇడియట్’, ఖడ్గం’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’… ఇలా ఎన్నో చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ సాధించాయి. రవితేజ పూర్తి పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో పుట్టి పెరిగిన ఆయన, సినీ పరిశ్రమకు రాక ముందు జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ లాంటి ప్రదేశాలన్నీ తిరిగారు. తర్వాత కుటుంబంతో సహా విజయవాడకు చేరుకున్నారు.
నిజానికి 1990లో ‘అభిమన్యు’ అనే కన్నడ చిత్రంతో రవితేజ సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో ‘కర్తవ్యం’, ‘చైతన్య’ హిందీలో ‘ఆజ్ కా గూండారాజ్’, ‘అల్లరి ప్రియుడు’, ‘క్రిమినల్’, ‘నిన్నే పెళ్లాడతా’లాంటి చిత్రాల్లో నటించిన తరువాత దర్శకుడు కృష్ణవంశీ రూపుదిద్దిన ‘సింధూరం’లో ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అయితే, ఆ చిత్రంతో ఆయన స్టార్ గా ఎదిగిపోలేదు. ఆ తర్వాత కూడా మరెన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే ‘ఖడ్గం’లాంటి చిత్రాలు ఆయన్ని ఒక స్థాయి హీరోగా నిలబెట్టాయి. ‘రాజా ది గ్రేట్’ చిత్రం ఆయనలోని నటుడికి పదును పెట్టిన చిత్రం. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో నటిస్తున్న రవితేజ మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.