Social Media Pressure : మన ఇంట్లో.. మన జీవితంలో ఏం జరిగినా సోషల్ మీడియాలో షేర్ చేయాలి. ఏ ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్ జరిగినా సోషల్ మీడియాలో షేర్ చేయాలి. మన కష్టాలు, నష్టాలు అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయాలి. ఏడవడం.. నవ్వడం.. కోప్పడటం.. అన్నీ సోషల్ మీడియాలోనే. ఇలా పూర్తిగా మనకి మనం సోషల్ మీడియాకి అతుక్కుపోవడం వల్ల లాభమా? నష్టమా? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు.. ఒత్తిడులు ఎదుర్కోవాలి?
ఒకరోజు సోషల్ మీడియా యాప్స్‌కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తేనే భరించలేరు. అంతగా సోషల్ మీడియాతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఏర్పడింది. ఎన్నో మంచి విషయాలకు వేదికగా ఉండే ఈ యాప్స్‌కి అతిగా మనం ఎడిక్ట్ అయితే అనర్ధాలు కూడా ఉన్నాయి. కొంతమంది తరచుగా పోస్టులు పెడుతుంటారు. ఆ పోస్టు పెట్టేసి ఆ తరువాత ఎప్పుడో దానిని చూడటం కాదు.. పదే పదే దానిని చెక్ చేస్తుంటారు.. ఎంతమంది దానిని లైక్ చేశారు? ఎన్ని కామెంట్లు వచ్చాయి? ఎవరు మన పోస్టువైపు తొంగి చూడలేదు? ఇలా రోజు మొత్తం ఆ పోస్టు మీదనే గడుపుతారు. దీనివల్ల విపరీతమైన ఒత్తిడి అనుభవిస్తారు. ఎవరైనా లైక్ కొట్టకపోతే.. ఎందుకు కొట్టలేదని? ఆలోచించేవారు.. దెబ్బలాడేవారు ఇలా రకరకాల మనస్తత్వాలు ప్రదర్శించేవారు ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఒత్తిడికి గురయ్యేవారిలో ఎక్కువమంది స్త్రీలే ఉన్నారట. దాంతో వీరు విపరీతమైన ఆందోళన ఎదుర్కుంటున్నారని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
చాలామంది పగలు, రాత్రి కూడా సోషల్ మీడియాకు అతుక్కుపోయి ఉంటారు. దానివల్ల కూడా అనారోగ్యాలపాలయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువగా సోషల్ మీడియాలో టైం గడిపేవారిలో తెలియని ఆందోళన, దేనిమీద ఏకాగ్రత లేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు కలుగుతాయి.